airlines: అదును చూసి దెబ్బేస్తున్న విమానయాన సంస్థలు.. ఎమర్జెన్సీని క్యాష్ చేసుకునేందుకు ఆరాటం
air fares: తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ లో మిచౌంగ్ తుఫాన్ సృష్టించిన విలయానికి ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలు చిగురుటాకులా వణికిపోయాయి. చెన్నై పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారైంది. ఎటు చూసినా నీరే కనిపించడంతో ఎప్పుడెప్పుడు బయటపడతామా అని ఇళ్లలో చిక్కుకుపోయిన వారు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పరిస్థితిని కొన్ని విమానం సంస్థలు క్యాష్ చేసుకోవాలని చూస్తుండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
తుఫాను కారణంగా చెన్నై నుంచి దేశంలోని ప్రధాన మెట్రో నగరాలకు వెళ్లే విమాన చార్జీలకు రెక్కలొచ్చాయి. సాధారణ రోజులతో పోలిస్తే రెండు, మూడు రెట్ల వరకు ధరలు పెరిగాయి. ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫారం డేటా ప్రకారం.. మంగళవారం చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు సోమవారం టిక్కెట్ బుక్ చేసుకునేందుకు 16 వేలు వెచ్చించాల్సి వచ్చింది. వారం క్రితం ధరలతో పోలిస్తే ఇది 3 రెట్లు కావడం ఆందోళన కలిగిస్తోంది.

చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు కూడా దాదాపు ఇదే విధంగా ఖర్చవుతుండగా.. ఢిల్లీ ప్రయాణానికి రెండింతలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కోల్‌కతా, ముంబై ఛార్జీలపై తుఫాను ప్రభావం అంతగా లేనట్లు తెలుస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా చెన్నై విమానాశ్రయం సేవలు సోమవారం వరకు నిలిపివేశారు. దీంతో మంగళవారం విమాన టికెట్స్ కు విశేష స్పందన లభించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ విధంగా ఎయిర్ లైన్స్ సంస్థలు విమాన టిక్కెట్ ఛార్జీలు విపరీతంగా పెంచడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బాలాసోర్ రైలు ప్రమాద సమయంలోను, ఇటీవల జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్ వేళలోనూ ఇదే విధానాన్ని అనుసరించాయి. అయినప్పటికీ విమాన ఛార్జీలు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడతాయని, వాటిపై ప్రభుత్వ నియంత్రణ ఉండదని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా తరచుగా చెప్తుండటం వింటూనే ఉన్నాం.


Click it and Unblock the Notifications