Flights To Ayodhya: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొత్త రామ మందిరం పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో దశాబ్ధాల వాగ్ధానాన్ని బీజేపీ నిలబెట్టుకోగా.. హిందువుల నిరీక్షణకు గడువు ముగుస్తోంది.
జనవరిలో అయోధ్య రామమందిరాన్ని దర్శించుకునేందుకు దేశంలోని నలుమూలల నుంచి భక్తులు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. మరో పక్క భారతీయ రైల్వే సైతం ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. అలాగే విమానయాన కంపెనీలు సైతం ప్రస్తుతం దీనిపై దృష్టి సారిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోదీ కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాన్ని త్వరలోనే అక్కడ ప్రారంభించనున్నారు. రామ మందిర ప్రారంభోత్సవం కోసం ప్రయాణికుల రద్దీ కారణంగా ఇండిగో జనవరి 15 నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి అయోధ్యకు రోజువారీ విమానాలను ప్రారంభించనుంది. ఈ విమానం ముంబై నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి 2.45 గంటలకు అయోధ్య చేరుకుంటుంది. అలాగే అయోధ్య నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.40 గంటలకు ముంబైకి వస్తుందని ఇండిగో ప్రకటించింది.
ఇదే క్రమంలో జనవరి 6 నుంచి దిల్లీ-అయోధ్య మధ్య, జనవరి 11 నుంచి అహ్మదాబాత్-అయోధ్య మధ్య సర్వీసులను నడపనున్నట్లు వెల్లడించింది. ఈ సేవలతో అయోధ్యలో ప్రయాణం, పర్యాటకం, వాణిజ్యం పెరుగి ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. అలాగే అనేక అంతర్జాతీయ దేశాల నుంచి నేరుగా అయోధ్యకు సేవలు నడపటం ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
బాబ్రీ మసీదు-రామజన్మభూమి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన 9 నెలల్లోనే నిర్మాణ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. జనవరి 22న జరిగే ప్రారంభోత్సవానికి ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆలయ ట్రస్టు తరఫున ఆహ్వానాలు సైతం వెళ్లాయి. దీనికి కొద్ది రోజుల ముందరే అంటే డిసెంబర్ 30న శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.


Click it and Unblock the Notifications