AirIndia: టాటాల చేతిలోకి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా దశ తిరిగింది. ఫిబ్రవరిలో కంపెనీ ప్రకటించిన విస్తరణ ప్రణాళికకు అనుగుణంగా ఎయిర్ ఇండియా చర్యలు చేపట్టింది. ఎయిర్ బస్ మరియు బోయింగ్ నుంచి 470 విమానాలు కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్‌పై ముందడుగు పడింది. ప్రస్తతం జరుగుతున్న పారిస్ ఎయిర్ షో సందర్భంగా ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
"ఈ ల్యాండ్‌మార్క్ ముందడుగు ఎయిర్ ఇండియా దీర్ఘకాలిక వృద్ధి మరియు విజయానికి బాసటగా నిలుస్తుందని భావిస్తున్నాం. ప్రపంచానికి అత్యుత్తమ ఆధునిక విమానయాన సౌకర్యం కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం" అని టాటా సన్స్ మరియు ఎయిర్ ఇండియా ఛైర్మన్ N చంద్రశేఖరన్ తెలిపారు. కాగా సాటైర్, బోయింగ్ గ్లోబల్ సర్వీసెస్ సంస్థలు.. విడిభాగాలు, నిర్వహణ, డిజిటల్ అప్లికేషన్స్ సహా విస్తృత శ్రేణి సేవలతో ఎయిర్ ఇండియాకు మద్ధతిస్తాయి.

"విస్తరణ ప్రణాళిక ద్వారా రానున్న 5 ఏళ్లలో ఎయిర్ ఇండియా అత్యాధునిక, ఇంధన సమర్థవంతమైన విమానాలను నడపనుంది. ఇండియా కేంద్రంగా గ్లోబల్ ఎయిర్ లైన్‌ను పునర్నిర్మించడానికి మా భాగస్వాములందరితో కలిసి పని చేస్తున్నందుకు మేము గర్విస్తున్నాము" అని ఎయిర్ ఇండియా MD & CEO కాంప్‌బెల్ విల్సన్ వెల్లడించారు.
"ఫ్లయింగ్ మహారాజా పునర్నిర్మాణంలో కీలక భాగస్వామిగా ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము. టాటా గ్రూప్ నాయకత్వంలో, కొత్త ఫోకస్డ్ మేనేజ్‌మెంట్ సారథ్యంలోని ఎయిర్‌లైన్ వ్యాపారంలో ఈ ప్రాజెక్ట్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ప్రపంచ స్థాయి ప్రీమియం క్యారియర్‌గా ఎయిర్ ఇండియా తన స్థానాన్ని తిరిగి పొందనుంది. మా ఆధునిక ఎయిర్‌క్రాఫ్ట్స్ సామర్థ్యాలు, సౌలభ్యం ఈ ప్రక్రియలో దోహదపడతాయని చెప్పడానికి గర్విస్తున్నాము" అని ఎయిర్‌బస్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ మరియు ఇంటర్నేషనల్ హెడ్ క్రిస్టియన్ స్చెరర్ పేర్కొన్నారు.
బడ్జెట్ క్యారియర్ ఇండిగో.. 500 నారో బాడీ విమానాల కోసం ఎయిర్‌బస్‌కు ఆర్డర్‌ను ఇస్తున్నట్లు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రోజే ఎయిర్ ఇండియా ఒప్పందాలపై సంతకాలు చేయడం గమనార్హం. ఇప్పటివరకు ఎయిర్‌బస్‌తో ఓ విమానయాన సంస్థ చేసిన అతిపెద్ద ఎయిర్‌క్రాఫ్ట్ ఆర్డర్ ఇదే. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను ఎయిర్ ఇండియా ఛాలెంజ్ చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications