Air India: ఎయిర్ ఇండియా తిరిగి తన సొంత గూటికి వచ్చిన తర్వాత కొత్త రూపం సంతరించుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగా టాటాలు పలు చర్యలు తీసుకుంటున్నారు. గత జూన్ నుంచి వీఆర్ఎస్ స్కీమ్ కింద పలువురు ఉద్యోగులను తొలగించిన టాటాలు తాజాగా రెండో విడత దీనిని అమలు చేస్తున్నారు. అయితే ఈ సారి ఎంత మంది ఉద్యోగులు వెళ్లిపోతారనే ఉత్కంఠ చాలా మందిలో నెలకొంది.

ఖర్చుల మదింపుకు..
ఒకప్పుడు ప్రభుత్వ యాజమాన్యంలో నడిచిన ఎయిర్ ఇండియా టాటాల చేతిలోకి రాగానే యువ ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటోంది. ఈ రిక్రూట్ మెంట్ ప్రక్రియ ఇతర ఎయిర్ లైన్ కంపెనీలను ఎంతగా ప్రభావితం చేసిందో అప్పట్లో మనందరం చూశాం. లేబర్ ఖర్చులను తగ్గించటానికి మరోసారి వీఆర్ఎస్ అమలుకు కంపెనీ ప్రకటన చేయటం గమనార్హం.

వీఆర్ఎస్ బెనిఫిట్స్..
రానున్న రెండు మూడు నెలల్లో రెండవ వీఆర్ఎస్ స్కీమ్ ఉద్యోగులకు అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. మెుదటి సారి వీఆర్ఎస్ స్కీమ్ కింద 1500 మంది ఉద్యోగులను టాటాలు విడిచిపెట్టారు. తొలి వీఆర్ఎస్ స్కీమ్‌లో 40 ఏళ్లు పైబడిన ఉద్యోగులు, 20 ఏళ్లు నిరంతరంగా కంపెనీలో పనిచేసిన వారు వెళ్లిపోవచ్చని ప్రకటించారు. అప్పట్లో వెళ్లిపోయిన ఉద్యోగులకు రూ.లక్ష గ్రాట్యుటీని అందించింది.

మెుత్తం ఉద్యోగులు..
ఎయిర్ ఇండియాలో ప్రస్తుతం 12,085 మంది ఉద్యోగులు ఉండగా.. అందులో 8,084 మంది పర్మనెంట్ ఉద్యోగులు. ఉద్యోగుల నిర్దిష్ట వయస్సు, స్వభావాన్ని బట్టి ఈ VRS స్కీమ్ కింద వదిలివేయవచ్చని చెప్పబడింది. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఉద్యోగులను కంపెనీలోకి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా ఈ కొత్త VRS స్కీమ్‌తో ముందుకు వచ్చిందని తెలుస్తోంది. కొత్తగా పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది నియామకాలు ఇప్పటికే జరిగాయి.


Click it and Unblock the Notifications