రన్ చేయాలంటే రూ.10 వేల కోట్లు ఇవ్వండి.. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ను కోరిన ఎయిర్ ఇండియా
జూన్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో ఎయిర్ ఇండియా కార్యకలాపాలపై తీవ్రమైన పరిశీలన మొదలైంది. ఈ నేపథ్యంలో, విమాన సంస్థ తన యజమానులైన టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ (SIA) నుండి కనీసం రూ. 10 వేల కోట్ల ఆర్థిక సహాయం కోరినట్లు బ్లూమ్‌బెర్గ తన తాజా నివేదికలో వెల్లడించింది.
భారతదేశంలో దశాబ్ద కాలంగా జరిగిన అత్యంత భయానక విమాన ప్రమాదం జూన్ నెలలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మానవ తప్పిదం, సాంకేతిక లోపాలు, పైలట్ శిక్షణ ప్రమాణాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దర్యాప్తు అధికారులు ఇప్పటికీ సాంకేతిక నిర్వాహక లోపాలను పరిశీలిస్తున్నారు. ఫలితంగా, ఎయిర్ ఇండియా నిర్వహణ వ్యవస్థలు, భద్రతా ప్రమాణాలు, ఇంజనీరింగ్ విశ్వసనీయతపై ప్రభుత్వ నియంత్రణ సంస్థలు కఠిన పర్యవేక్షణ ప్రారంభించాయి.
2022లో టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి సంస్థ విస్తృత స్థాయిలో పునరుద్ధరణ చర్యలను చేపట్టింది. పాత విమానాలను ఆధునీకరించడం, సేవా నాణ్యత పెంపు, సిబ్బంది శిక్షణ, గల్ఫ్ క్యారియర్‌లకు పోటీ ఇవ్వగల అంతర్జాతీయ మార్గాల పునరుద్ధరణ ఈ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాలో 74.9 శాతం వాటా కలిగి ఉండగా, మిగతా 25.1 శాతం వాటా సింగపూర్ ఎయిర్‌లైన్స్ కలిగి ఉంది.

నివేదిక ప్రకారం ప్రతిపాదిత రూ. 10 వేల కోట్ల నిధులు ఎయిర్ ఇండియా భద్రత, ఇంజనీరింగ్, నిర్వహణ వ్యవస్థలను మెరుగుపరచడానికి ఉపయోగించబడతాయి. ఈ నిధులతో సిబ్బంది శిక్షణ, కేబిన్ అప్‌గ్రేడ్లు, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి వంటి అంశాలను వేగవంతం చేయాలని యాజమాన్యం భావిస్తోంది. ఈ సహాయం వడ్డీ లేని రుణం రూపంలో లేదా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇవ్వాలా అనే విషయం ఇంకా చర్చల దశలో ఉంది.
రాయిటర్స్ పేర్కొన్న వివరాల ప్రకారం సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఒక ఇమెయిల్‌లో మేము ఎయిర్ ఇండియా కొనసాగుతున్న పరివర్తన ప్రోగ్రామ్‌కి టాటా సన్స్‌తో కలిసి మద్దతు ఇస్తున్నామని తెలిపింది. అయితే, నివేదికలో పేర్కొన్న నిధుల అభ్యర్థనపై టాటా సన్స్, ఎయిర్ ఇండియా అధికారికంగా ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. ప్రమాదం అనంతరం ఎయిర్ ఇండియా CEO సంస్థ సిబ్బందిని ఉద్దేశించి భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేయనున్నట్లు ప్రకటించారు. సంస్థ లోపలి సమీక్షలు జరుగుతున్నాయని, భద్రత మరియు కార్యాచరణ క్రమశిక్షణపై ఎటువంటి రాజీ ఉండదని ఆయన పేర్కొన్నారు
ఎయిర్ ఇండియా బహుళ సంవత్సరాల పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా విస్తారా కార్యకలాపాలను విలీనం చేయడం,ఎయిర్‌బస్, బోయింగ్ సంస్థల నుండి 470 కొత్త విమానాల భారీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఎయిర్ ఇండియా గల్ఫ్ క్యారియర్‌లకు పోటీగా తన అంతర్జాతీయ ఉనికిని పునరుద్ధరించాలనే సంకల్పంతో ఉంది.


Click it and Unblock the Notifications