Air India: టాటాల ఆధ్వర్యంలో నడుస్తోన్న ఎయిర్ ఇండియా ఇటీవల భారీగా కొత్త విమానాలను ఆర్డర్ పెట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. తాజాగా ఇప్పుడు పైలట్లతో సహా క్యాబిన్ సిబ్బంది జీతాలను సవరించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే విధంగా రూపకల్పన చేసింది. వేతనాలకు అదనంగా దేశీయ, అంతర్జాతీయ లేఓవర్‌లు మరియు ఇతర అలవెన్సులనూ అందిస్తోంది.
టాటా గ్రూపునకు సంబంధించిన ఎయిర్ లైన్ లో పైలట్‌కు కనీస వేతనం నెలకు 50 వేల నుంచి గరిష్టంగా 8.5 లక్షల వరకు ఉండనుంది. పైలట్ కేటగిరీలు, విమాన ప్రయాణాల సంఖ్యను బట్టి జీతభత్యాల విధానం మారుతూ ఉంటుంది. క్యాబిన్ సిబ్బంది వేతనాలు 25 వేలుగా నిర్ణయించారు. వీటిలోనూ స్థాయిలను బట్టి గరిష్ఠంగా 78 వేలకు అందుకునే అవకాశం ఉంది.

పైలట్ జీతం: పైలట్ల విషయానికి వస్తే ట్రైనీ దగ్గర నుంచి P1 రేటింగ్ ఉన్న సీనియర్ కమాండర్ వరకు వివిధ దశలు ఉంటాయి. తదనుగుణంగా వారికి ఎయిర్ ఇండియా చెల్లిస్తోంది. జూనియర్ పైలట్ 90 గంటల వరకు చేసిన ప్రయాణానికి 1500-9230 వరకు ఫ్లయింగ్ అలవెన్సు ఉంటుంది. వేతనాల మాదిరిగానే వీటిలోనూ స్థాయిని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. విస్తృత బాడీ అలవెన్సు గా 75 వేలు, డొమెస్టిక్ లేఓవర్ కింద 1,600 వరకు సంపాదించే ఛాన్స్ ఉంది.
క్యాబిన్ సిబ్బంది వేతనం: క్యాబిన్ సిబ్బంది వేతనాలు కూడా దశల వారీగా ఉంటాయి. అంటే ట్రైనీ (ఫ్రెషర్)కి 25 వేలు నుంచి అనుభవం ఆధారంగా ఎగ్జిక్యూటివ్ క్యాబిన్ ఉద్యోగులకు 78 వేల వరకు ఎయిర్ ఇండియా చెల్లించనుంది. పైలట్ల మాదిరిగానే వీరికి 375 నుంచి 1275 వరకు ఫ్లయింగ్ అలవెన్సు లభించనుంది. అంతర్జాతీయ, దేశీయ లేఓవర్‌లతో పాటు క్యాబిన్ సిబ్బంది.. విమానాశ్రయ స్టాండ్ బై మరియు చెక్ క్రూ అలవెన్సులు సైతం అందుకుంటారు. పైలట్లు మరియు క్యాబిన్ సిబ్బంది ఇద్దరికీ నెలకు 70 గంటల విమాన ప్రయాణంపై జీతభత్యాలు ఆధారపడతాయి.


Click it and Unblock the Notifications