లేఆఫ్స్ వేళ ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్.. నెలకు ఎంత మందిని రిక్రూట్ చేసుకోనుందంటే
Air India: ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ తో ఆయా సంస్థలు బెంబేలెత్తిస్తున్న వేళ.. ఎయిర్ ఇండియా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ప్రస్తుత ట్రెండ్ కు విరుద్ధంగా.. విమానయాన రంగంలో వేల సంఖ్యలో పైలెట్లు, క్యాబిన్ క్రూను రిక్రూట్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. దేశంలో ఈ విభాగానికి పెరుగుతున్న డిమాండ్ కూడా ఇందుకు ఓ కారణం కావచ్చు.
ప్రతి నెలా 550 మంది క్యాబిన్ సిబ్బందిని మరియు 50 మంది పైలట్‌లను రిక్రూట్ చేసుకోనున్నట్లు ఎయిర్ ఇండియా చైర్మన్ క్యాంప్ బెల్ విల్సన్ ప్రకటించారు. నియామకానికి ఎటువంటి నిర్ణీత లక్ష్యం లేదని, రిక్రూట్ చేసుకున్న వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. తమ ఐదేళ్ల పరివర్తన ప్రణాళికలో భాగంగా.. ఈ ఏడాది చివరి నాటికి 6 వైడ్ బాడీ A350 జెట్‌లను తమ ఫ్లీట్‌లో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు.

గతేడాది జనవరిలో ప్రభుత్వం నుంచి పగ్గాలు చేపట్టిన తర్వాత, 470 విమానాల కోసం టాటా గ్రూప్ అతిపెద్ద ఆర్డర్ ఇవ్వడం తెలిసిందే. విదేశాలకూ తమ కార్యకలాపాలను విస్తరించడం, ప్రయాణికులకు మెరుగైన విమానయానాన్ని అందించడం కోసం అనేక చర్యలను తీసుకుంటోంది. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు ముందుతో పోలిస్తే క్యాబిన్ క్రూను దాదాపు 10 రెట్లు, పైలెట్లను 5 రెట్లు పెంచనున్నట్లు విల్సన్ వెల్లడించారు.
ప్రస్తుత నియామకాల రేటు ఈ ఏడాది చాలా వరకు కొనసాగుతుందని, సంవత్సరం చివరి నాటికి క్రమంగా తగ్గుతుందని క్యాంప్ బెల్ స్పష్టం చేశారు. ఆపై 2024 చివరి నాటికి మళ్లీ వేగాన్ని పుంజుకుంటుందని వెల్లడించారు. నాలుగు ఎయిర్ లైన్స్ లో ఉన్న సిబ్బందకి అనుగుణంగా బయటి వారిని తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎయిర్ లైన్స్ ను ఏకీకృతం చేస్తూ, గణనీయంగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.


Click it and Unblock the Notifications