Air India News: ఫ్లైట్ టికెట్స్‌పై ఎయిర్ ఇండియా కొత్త ప్రతిపాదన.. ఇండస్ట్రీలో మొదటిసారి..
Air India Fare lock: దేశీయ విమానాయాన రంగం దినాదినాభివృద్ధి చెందుతోంది. ఎన్నడూ లేని విధంగా ఇతర దేశాలతో పోటీపడుతూ వందల కొద్దీ విమానాలను పలు భారతీయ కంపెనీలు ఇటీవల ఆర్డర్ చేశాయి. అయితే అందుకు తగినట్లుగానే ప్రయాణ చార్జీలు కూడా పెరిగాయి. జర్నీ తేదీని బట్టి టికెట్ రేట్లలో హెచ్చుతగ్గులు ఉంటుంటాయి. దీనివల్ల ప్రయాణీకులు కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఇదే విషయంపై ఎయిర్ ఇండియా తాజాగా కీలక ప్రతిపాదన చేసింది.
ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న టికెట్ ధరలకు కళ్లెం వేసేందుకు ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది. రెండు రోజులు పాటు టికెట్ ధరలను లాక్ చేసుకునేందుకుదుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా ఆ రెండు రోజుల్లో టికెట్ ధరలు మారినా వినియోగదారులపై అవి ఎటువంటి ప్రభావం చూపించవు. ముందుగా లాక్ చేసిన ధరకే టికెట్స్ సొంతం చేసుకోవచ్చు. అయితే దీనికోసం కొంత మొత్తాన్ని ముందుగా చెల్లించాల్సి ఉంటుంది.

ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండే టికెట్ ధరలను ప్రయాణికులకు అనుకూలంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణానికి కనీసం 10 రోజుల ముందు ఈ సదుపాయం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఫేర్ లాక్ పాలసీ వల్ల విమానయాన రంగం మరింత పుంజుకుంటుందని అంచనా వేస్తుంది. పెద్ద సంఖ్యలో కస్టమర్లను ఆకర్షించవచ్చు అని భావిస్తుంది.
ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు ఎయిర్ ఇండియా వెబ్‌సైట్‌లో లేదా మొబైల్ యాప్ లోని ఆప్షన్ వినియోగించుకోవచ్చు. అంతర్జాతీయ ప్రయాణానికి 850, మరింత దూరం అయితే 1500 చొప్పున నాన్ రిఫండబుల్ అమౌంట్ ముందే చెల్లించాల్సి ఉంటుంది. ఇక దేశీయ రూట్లలో కేవలం 500 చెల్లిస్తే సరిపోతుంది. ఏదైనా కారణం వల్ల ప్రయాణం క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం ఆ డబ్బు తిరిగి రాదని గుర్తించాలి.


Click it and Unblock the Notifications