విమానయానంపై గట్టి దెబ్బేసిన వందే భారత్.. పెద్ద మొత్తంలో ఎయిర్‌లైన్స్ ఆదాయానికి గండి
Vande Bharat: రైల్వే ప్రయాణీకుల కోసం కేంద్రం కొత్తగా వందే భారత్ సర్వీసులను ఇటీవల ప్రారంభించింది. ఈ విభాగంలో మరిన్ని కొత్త మోడళ్లను సైతం ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రెడీ చేసుకుంటోంది. అయితే విమానయాన రంగానికి ఈ వందే భారత్ రైళ్లు భారీగా దెబ్బేసినట్లు తెలుస్తోంది.
'వందే భారత్ రైళ్లలో పిల్లల (1-14 సంవత్సరాలు) సగటు ఆక్యుపెన్సీ 5 శాతం ఉంది. మొత్తం ప్రయాణీకుల్లో 4.5 శాతం మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. వీటిని ప్రవేశపెట్టడంతో విమాన రాకపోకలు 10-20 శాతం తగ్గాయి. వాటి ఛార్జీల్లోనూ దాదాపు 30 శాతం క్షీణత కనిపిస్తోంది' అని సెంట్రల్ రైల్వే (CR) చీఫ్ PRO శివరాజ్ తెలిపారు.

ప్రయాణీకుల లింగం, వయస్సు ఆధారంగా వందే భారత్ రైళ్ల డిమాండ్‌ను రైల్వే మొదటిసారిగా పర్యవేక్షిస్తోంది. ఈ డేటా ద్వారా ప్రకటనలు వంటి అనుబంధ పరిశ్రమల నుంచి ఆదాయం పొందేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదేకాక సేవలు, ఫుడ్ మెనూ సహా భవిష్యత్తులో ఇతర సౌకర్యాల కల్పనకు ఈ డేటా ఎంతగానో ఉపయోగపడుతుందని పబ్లిక్ పాలసీ అనలిస్ట్ (మొబిలిటీ మరియు రవాణా) పరేష్ రావల్ పేర్కొన్నారు.
సెంట్రల్ రైల్వే క్రోడీకరించిన సమాచారం ప్రకారం.. ముంబై నుంచి ప్రారంభమయ్యే ఈ రైళ్లలో 31-45 సంవత్సరాల వయస్సు గలవారు ఎక్కువగా ఉంటున్నారు. 15-30 ఏళ్ల ప్రయాణీకులు తరువాతి స్థానంలో నిలిచారు. ముంబై నుంచి షిర్డీ, మడ్‌గావ్ మరియు షోలాపూర్‌లకు వెళ్లే రైళ్లలో సెప్టెంబర్ ఆక్యుపెన్సీ 77-101 శాతం మధ్యలో ఉంది. వీటికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు భారతీయ రైల్వే పలు మార్గాలను అన్వేషిస్తోంది.


Click it and Unblock the Notifications