ChatGPT: ఇన్వెస్టర్లకు చాట్ జీపీటీ కాసుల పంట.. మానవ మేధస్సుకు AI సవాల్..!
AI Investment Ideas: సాధారణంగా పెట్టుబడులు పెట్టేవారు తమ సొంత పరిజ్ఞానంతో లేదా కొందరు అందించే సూచనలతో ట్రేడింగ్ చేస్తుంటారు. మరికొందరు రిస్క్ తీసుకోలేక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లలో పెట్టుబడులు పెడుతుంటారు. కానీ ఇప్పుడు ఏఐ ట్రెండ్ ఇందులో సంచలనాలను సృష్టిస్తోంది.
పర్సనల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. స్టాక్ పికింగ్‌లో కొంతమంది ప్రముఖ ఇన్వెస్టర్లను ఫాలో అవటం కంటే చాట్‌బాట్ ChatGPT మెరుగైన సలహాలు ఇస్తున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. మార్చి 6-ఏప్రిల్ 28 మధ్య Finder.com నిర్వహించిన ప్రయోగంలో ChatGPT ద్వారా ఎంపిక చేయబడిన 38 స్టాక్‌ల డమ్మీ పోర్ట్‌ఫోలియో 4.9 శాతం రాబడిని అందించింది. ఇది టాప్-10 మ్యూచువల్ ఫండ్స్ సగటు కంటే చాలా ఎక్కువని తేలింది.

చాట్ జీపీటీ రాక ప్రపంచ వ్యాప్తంగా అనేక విషయాల్లో మార్పులకు నాంది పలికింది. తాజాగా ఫండ్ మేనేజర్ సూచించిన స్టాక్‌ల కంటే ChatGPT రూపొందించిన డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియోతో కూడిన ఫండ్‌లు మెరుగైన రాబడిని ఇచ్చాయని తెలుస్తోంది. ఫండ్ మేనేజర్లు పెట్టుబడిదారులకు మంచి రాబడిని అందించగల ఫండ్‌లను ఎంచుకుంటారు. కానీ ఇప్పుడు చాట్ జీపీటీ ఈ పనిని చాలా బాగా చేస్తోంది.
ఏఐ టూల్ చాట్ జీపీటీ సూచించిన కంపెనీలకు తక్కువ రుణ భారం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ టూల్ సదరు కంపెనీల గ్రోత్ హిస్టరీ వంటి అంశాలను సైతం పరిగణలోకీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చాట్ జీపీటీ సూచించిన కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్, నెట్‌ఫ్లిక్స్, వాల్‌మార్ట్ కూడా ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం చాట్ జీపీటీలో ఈ సేవలు కేవలం పెయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం నెలవారీ రుసుము 20 డాలర్లుగా ఉంది. అయితే ఈ తరహా పెట్టుబడి నిర్ణయాలు ప్రస్తుతం కొత్త కాబట్టి కొంత జాగ్రత్త పాటించటం తప్పనిసరి. ప్రస్తుతానికైతే ఏఐ టూల్ ఫండ్ మేనేజర్ల కంటే మంచి రాబడిని అందిస్తుండటంతో పెట్టుబడిదారులు సంతోషంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications