startup: ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా స్టార్టప్లలోకి నిధులు వస్తూనే ఉన్నాయి. టెక్ ఆధారిత కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబడుతూ దిగ్గజ సంస్థలకు సైతం షాకిచ్చే స్థాయిలో దూసుకుపోతున్నాయి. ChatGPT అరంగేట్రంతో ఒక్కసారిగా AI వైపు వివిధ కంపెనీలు దృష్టి పెట్టాయి అనడంలో సందేహం లేదు. ఈ విభాగంలో మార్కు చూపించేందుకు Adept సైతం నిధుల సమీకరణ ప్రారంభించింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ Adept, 350 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు రాబట్టింది. ఇటీవల ఇద్దరు సహ వ్యవస్థాపకులు సంస్థ నుంచి బయటకు మళ్లినా, పెట్టుబడిదారుల నమ్మకం మాత్రం సడలలేదు. జనరల్ కాటలిస్ట్, స్పార్క్ క్యాపిటల్ ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించినట్లు కంపెనీ ప్రకటించింది. కొత్త ఉత్పత్తుల విడుదల, మోడళ్ల శిక్షణ, కృత్రిమ మేధలో ప్రతిభావంతులను నియమించుకోవడానికి వీటిని వినియోగించనున్నట్లు వెల్లడించింది.

గూగుల్ లో పనిచేసిన మాజీ పరిశోధకులు Adept ను నెలకొల్పారు. న్యూరల్ నెట్ వర్క్స్ ద్వారా మోడళ్లకు శిక్షణ ఇవ్వడంపై ఇది ముఖ్యంగా దృష్టిసారించింది. తద్వారా ఎంటర్ ప్రైజ్ క్లయింట్లకు అవసరమైన సాధారణ పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ స్టార్టప్ సహాయపడుతోంది. అడోబ్ ఫొటోషాప్, ఎయిర్ టేబుల్ వంటి సాఫ్ట్ వేర్లను యాక్సెస్ చేయడానికి 'న్యాచురల్ లాంగ్వేజ్ ఇంటర్ ఫేస్'ను రూపొందిస్తుంది. ఇందుకోసం వివిధ కంపెనీల డేటాను వినియోగిస్తూ, వాటితో కలిసి పనిచేస్తుంది.

ఏప్రిల్ 2022లో ఈ స్టార్టప్ 65 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. Adept అధికారికంగా స్పష్టం చేయనప్పటికీ ఇది ఓ యూనికార్న్ అని మార్కెట్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. "కేవలం టెక్స్టును రూపొందించడానికి బదులు లాంగ్వేజ్ మోడళ్లతో ఈ సంస్థ యాక్షన్స్ సృష్టించనుంది. వీటిని ఆటోమేట్ చేయడం ద్వారా ఓ కంపెనీలోని ప్రస్తుత సిబ్బందిని.. మరింత సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉంది" అని జనరల్ కాటలిస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ దీప్ నిషార్ తెలిపారు.


Click it and Unblock the Notifications