ఏఐ నైపుణ్యాలు: ఐటీ ఉద్యోగాలకు ఇదే కొత్త రూల్! మీ భవిష్యత్తుకు కీలకం
ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీల రాకతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఉద్యోగాల మార్కెట్ భారీ మార్పులకు లోనవుతోంది. ఏఐ నైపుణ్యాలు ఉన్నవారు మాత్రమే ఐటీ రంగంలో తమ ఉద్యోగాలను నిలబెట్టుకోగలరనే పరిస్థితి ఏర్పడింది. దీంతో, ప్రస్తుతం కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు తమ భవిష్యత్తు ఏమవుతుందోనని గందరగోళానికి గురవుతున్నారు.
భారతదేశంలోని టాప్ ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ ఈ ఏడాది క్యాంపస్ హైరింగ్ ద్వారా కాలేజీ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రక్రియను వేగవంతం చేశాయి. అయితే, గతంలోలా భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవడానికి బదులుగా, ఇప్పుడు 'ఫ్రాంటియర్ ఇంజనీరింగ్ టాలెంట్' (Frontier Engineering Talent) అని పిలిచే అత్యాధునిక, ప్రత్యేక నైపుణ్యాలున్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో 'ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజనీర్స్' విభాగంలో 9000 మందిని నియమించుకోనున్నట్లు టీసీఎస్ ప్రకటించగా, ఇన్ఫోసిస్ 6000 మందిని తీసుకోనున్నట్లు తెలిపింది. అంటే, ఈ ఉద్యోగాల్లో చేరేవారు కేవలం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా మాత్రమే కాకుండా, ప్రొడక్ట్ థింకింగ్, కస్టమర్ కన్సల్టింగ్, ఏఐ ఎక్స్‌పర్టైజ్ వంటి పనులు కూడా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత ఐటీ కంపెనీల్లో ఇలాంటి నైపుణ్యాలున్న వారి కొరత తీవ్రంగా ఉంది.
అందుకే, ప్రస్తుతం కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు కేవలం కోడింగ్ మాత్రమే కాకుండా, అన్ని రకాల నైపుణ్యాలను పెంచుకోవడం మంచిది. గత కొన్నేళ్లుగా, ప్రపంచ ఆర్థిక మాంద్యం, ఏఐ టెక్నాలజీ ప్రభావం కారణంగా ఐటీ కంపెనీల ఆదాయాలు తగ్గాయి. దీంతో ఫ్రెషర్స్‌గా కాలేజీ విద్యార్థులను తీసుకోవడం తగ్గించాయి. కొన్ని కంపెనీలైతే క్యాంపస్ హైరింగ్‌ను పూర్తిగా నిలిపివేశాయి. కానీ ఇప్పుడు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఐటీ కంపెనీలు మళ్లీ క్యాంపస్‌ల నుంచి నియామకాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయని మనీ కంట్రోల్ నివేదిక పేర్కొంది.
గతంలోలా కాకుండా, ఈసారి కంపెనీలు నియామకాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఐటీ కంపెనీలు ఇప్పుడు సాధారణ కోడింగ్ పనుల కోసం కాకుండా, అత్యాధునిక టెక్నాలజీ రంగాల్లో నైపుణ్యం ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం వెతుకుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి రంగాల్లో మంచి పట్టు ఉన్న విద్యార్థులకే పెద్దపీట వేస్తున్నాయి.
కాబట్టి, కాలేజీ చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు ఈ రంగాల్లో నైపుణ్యాలు పెంచుకుంటే, పెద్ద ఐటీ కంపెనీల్లో ఉద్యోగం ఖాయం. ఇప్పటికే ఐటీ కంపెనీలు ఎలాంటి ప్రాజెక్ట్ లేకుండా 'బెంచ్' మీద ఉన్న ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించాయి.
అందువల్ల, భవిష్యత్తులో ప్రాజెక్టులు రావొచ్చనే అంచనాతో అందరినీ ఒకేసారి ఉద్యోగంలోకి తీసుకోవడం మానేసి, కేవలం అవసరాన్ని బట్టి మాత్రమే కొత్తవారిని నియమించుకుంటున్నాయి. కాబట్టి, పట్టభద్రులు కేవలం డిగ్రీతో సరిపెట్టుకోకుండా, ఏఐ వంటి అత్యాధునిక టెక్నాలజీ స్కిల్స్‌ను నేర్చుకుంటేనే అగ్రశ్రేణి ఐటీ కంపెనీలలో సులభంగా ఉద్యోగం సంపాదించగలరు, దానిని నిలబెట్టుకోగలరు.


Click it and Unblock the Notifications