2028లో AI భూకంపం.. భారత ఐటీ కంపెనీలకు డేంజర్ బెల్స్.. లక్షలాది ఉద్యోగాలకు పెనుముప్పు..
ఐటీ రంగానికి షాకింగ్ న్యూస్.. ఆంత్రోపిక్ దెబ్బకు కుదేల్ అయిన ఐటీ రంగం ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. గత 30 రోజుల్లో భారత ఐటీ సేవల రంగం కోట్ల రూపాయల మార్కెట్ విలువను కోల్పోయిన సంగతి విదితమే. మార్కెట్ విలువ దాదాపు 50 బిలియన్ డాలర్లు తగ్గి దాదాపు రూ.4.5 లక్షల కోట్లకు చేరుకుంది. తాజాగా ఈ పతనానికి మరింత ఆందోళనకర అంశాలను జోడిస్తూ సిట్రిని రీసెర్చ్ సంచలన నివేదికను విడుదల చేసింది.
2028లో కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఆటోమేషన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపివేసే స్థాయికి చేరుతుందని సిట్రిని రీసెర్చ్ విడుదల చేసిన ఒక ఊహాజనిత నివేదిక తీవ్ర చర్చకు దారితీసింది.ది 2028 గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్ - ఎ థాట్ ఎక్సర్‌సైజ్ ఇన్ ఫైనాన్షియల్ హిస్టరీ, ఫ్రమ్ ది ఫ్యూచర్ అనే ఈ నివేదికలో.. సహ రచయిత అలాప్ షా, AI వలన ఏర్పడే సాంకేతిక అంతరాయం భారత ఐటీ దిగ్గజాలకు పీడకల దృశ్యంగా మారవచ్చని హెచ్చరించారు.
Citrini Research నివేదికలో భాగంగా రూపొందించిన జూన్ 2028 నుంచి మాక్రో మెమో అనే కల్పిత కథనం.. తీవ్రమైన AI-ఆధారిత ఆర్థిక షాక్‌ను వివరిస్తుంది. ఇందులో వేగవంతమైన ఆటోమేషన్ కారణంగా భారీ స్థాయిలో వైట్-కాలర్ ఉద్యోగాల తొలగింపులు జరుగుతాయని, వినియోగదారుల డిమాండ్ తగ్గుతుందని, దాంతో ప్రపంచ మార్కెట్లు తీవ్ర అస్థిరతకు గురవుతాయని పేర్కొంది.

ప్రత్యేకంగా పెద్ద డెలివరీ బృందాలపై ఆధారపడే భారత ఐటీ అవుట్‌సోర్సింగ్ కంపెనీలకు ఈ మార్పు అత్యంత ప్రమాదకరమని నివేదిక చెబుతోంది. Tata Consultancy Services, Infosys, Wipro వంటి సంస్థలు, AI ఆధారిత ఆటోమేషన్ వల్ల తమ సంప్రదాయ వ్యాపార నమూనా పూర్తిగా దెబ్బతినే ప్రమాదంలో ఉన్నాయని విశ్లేషించింది.
ఈ ఊహాజనిత దృశ్యం ప్రకారం.. అమెరికాలో నిరుద్యోగం 10 శాతానికి చేరుతుందని.. అలాగే S&P 500 సూచీ 2026 గరిష్ట స్థాయి నుంచి దాదాపు 38 శాతం పడిపోతుందని అంచనా వేసింది. కంపెనీలు మిడ్-స్కిల్ ఉద్యోగులను AI ఏజెంట్లతో భర్తీ చేయడం వల్ల మొదట్లో లాభాలు పెరిగినా.. మధ్యతరగతి ఆదాయాలు క్షీణించి ఘోస్ట్ GDP అనే పరిస్థితి ఏర్పడుతుందని నివేదిక హెచ్చరిస్తోంది. అంటే ఉత్పత్తి పెరుగుతున్నా, వాస్తవ ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది.
AI కోడింగ్ ఏజెంట్ల ఉపాంత ఖర్చు కేవలం విద్యుత్ ఖర్చు స్థాయికి పడిపోతుందని, దాంతో లెగసీ IT కంపెనీలు కాంట్రాక్ట్ రద్దులను ఎదుర్కొంటాయని సిట్రిని అంచనా వేసింది. ఈ ప్రక్రియ 2027 నాటికి వేగవంతమవుతుందని పేర్కొంది.
భారతదేశానికి కీలకమైన ఐటీ సేవల రంగం ఏటా 200 బిలియన్ డాలర్లకు పైగా ఎగుమతులు చేస్తోంది. ఇది దేశ కరెంట్ అకౌంట్ మిగులుకు ప్రధాన ఆధారం. అయితే, 2028 నాటికి ఈ రంగంపై ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉంటే.. కేవలం నాలుగు నెలల్లోనే రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 18 శాతం వరకు పడిపోతుందని నివేదిక అంచనా వేస్తోంది. అత్యంత తీవ్రమైన పరిస్థితిలో.. 2028 మార్చి త్రైమాసికం నాటికి International Monetary Fund భారత ప్రభుత్వంతో ప్రాథమిక చర్చలు ప్రారంభించే పరిస్థితి కూడా తలెత్తవచ్చని హెచ్చరించింది.
అయితే ఈ నివేదికపై మార్కెట్ నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మార్కెట్ విశ్లేషకుడు దీపక్ షెనాయ్ దీన్ని డూమ్స్‌డే గా అభివర్ణిస్తూ.. AIపై అతిశయోక్తి అంచనాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఏదేమైనా సిట్రిని రీసెర్చ్ నివేదిక ఒక ఊహాజనిత ఆలోచనా వ్యాయామమే అయినప్పటికీ, AI టెక్నాలజీ భారత ఐటీ సేవల రంగానికి తీసుకొచ్చే దీర్ఘకాలిక ప్రమాదాలపై గంభీరమైన హెచ్చరికగా మార్కెట్లు దీనిని పరిగణిస్తున్నాయి.


Click it and Unblock the Notifications



