2030 నాటికి 1.8 కోట్ల ఉద్యోగాలు మాయమవుతాయా?AI తలకిందులు చేయబోతుందా!
భవిష్యత్తులో భారతదేశ ఉద్యోగ రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాలా ప్రభావితం చేయబోతోంది. ప్రత్యేకంగా తయారీ (ఉత్పత్తి), రీటైల్, విద్య రంగాల్లో భారీ మార్పులు జరగనున్నాయి. తాజా నివేదిక ప్రకారం వచ్చే పదేళ్లలో, లక్షలాది ఉద్యోగాల విధానం మారబోతుంది. కొన్ని ఉద్యోగాలు పూర్తిగా AI వల్ల తొలగిపోతాయి, మరికొన్ని ఉద్యోగాలు AIతో కలిసి పనిచేసేలా మారతాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే భవిష్యత్తులో ఉద్యోగాలు పూర్తిగా మాయమవుతాయన్న దానికన్నా, అవి ఎలా మారుతున్నాయో అర్థం చేసుకోవడం మనకు చాలా ముఖ్యం. AI టెక్నాలజీని తెలుసుకోవడం, కొత్త పనితీరులు నేర్చుకోవడం వలన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు.
ప్రముఖ డిజిటల్ వర్క్‌ఫ్లో సంస్థ ServiceNow తాజా అధ్యయనం ప్రకారం, 2030 నాటికి తయారీ, రిటైల్, విద్య రంగాల్లో ఏకంగా 1.8 కోట్ల మంది ఉద్యోగులు ఏఐ ప్రభావానికి లోనవ్వనున్నారు. తాజా రిపోర్ట్ ప్రకారం, తయారీ, రిటైల్, విద్య రంగాల్లో Agentic AI (స్వయం చర్యలతో పని చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ సాంకేతిక విప్లవంలో అత్యధికంగా ప్రభావితమయ్యే రంగం తయారీ రంగం. ఇందులో సుమారు 80 లక్షల ఉద్యోగాలు AI వల్ల ప్రభావంలోకి వచ్చే అవకాశం ఉంది. తర్వాతి స్థానం రిటైల్ రంగానికి, ఇది కూడా భారీగా మారబోతోంది. ఇందులో సుమారు 76 లక్షల ఉద్యోగాలు మార్పుల పాలవుతాయి. ఇక విద్య రంగం కూడా మినహాయించబడదు. ఇందులోని 25 లక్షల ఉద్యోగాలు రానున్న సంవత్సరాల్లో మార్పులకు గురవుతాయి. ఈ మార్పులకన్నిటికీ ప్రధాన కారణం Agentic AI అనే కొత్త రకమైన టెక్నాలజీ. దీని వల్ల కొన్ని పనులు మనుషుల సహాయం లేకుండానే ఆటోమేటిక్‌గా పూర్తవుతాయి. అంటే, కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్‌లు స్వయంగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకుని పనులు చేయగలవు. అందుకే కొన్ని ఉద్యోగాలు మారిపోతున్నాయి లేదా అవసరం తగ్గుతోంది.
AI వల్ల ఉద్యోగాలు పోతాయా? అనే ప్రశ్న చాలా మందిలో కలుగుతోంది. ఎందుకంటే, ఇటీవలే దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన TCS సుమారు 12,000 ఉద్యోగాలను తొలగించనుంది, ఇందులో ఒక ముఖ్య కారణం AI వినియోగం పెరగడం కావడం ఆందోళన కలిగిస్తోంది.
అయితే, అన్ని ఉద్యోగాలు పోతాయా అంటే కాదు. కొన్ని ఉద్యోగాలు పోతాయి, కొన్ని మారిపోతాయి, ఇంకొన్ని కొత్తగా వస్తాయి. ServiceNow సంస్థ ఇండియా టెక్నాలజీ డైరెక్టర్ సుమీత్ మాథూర్ ఇలా చెప్పుకొచ్చారు "AI వల్ల 1.35 కోట్ల పాత ఉద్యోగ రోల్స్ మారతాయి, కానీ అదే సమయంలో 30 లక్షల కొత్త టెక్నాలజీ ఉద్యోగాలు ఏర్పడతాయి." Change Managers, పేరోల్ క్లర్క్‌లు లాంటి పనులు ఎక్కువగా రొటీన్ కాబట్టి AI వాటిని స్వయంగా చేయగలదు. కానీ సిస్టమ్ అడ్మిన్లు, కన్సల్టెంట్లు లాంటి ఉద్యోగాలు AIతో కలిసి పనిచేసేలా మారతాయి. అంటే AI వీరి పనికి సహాయం చేస్తుంది, కాని పూర్తిగా భర్తీ చేయదు.
భారత్‌కు ఇది మంచి అవకాశమని సుమీత్ మాథూర్ అంటున్నారు. మన దేశం AI పరిజ్ఞానం కలిగిన టాలెంట్‌ను పెంచితే, వర్క్ విధానాలను మార్చితే, మనం ఇతర దేశాలకంటే ముందుండగలమని ఆయన అభిప్రాయం. ఒక్క మాటలో చెప్పాలంటే AIతో భయపడే అవసరం లేదు. కొత్త టెక్నాలజీకి అలవాటు పడితే, కొత్త అవకాశాలు మనకోసమే ఉంటాయి.


Click it and Unblock the Notifications