ఐటీ కంపెనీల దుకాణం బంద్ అవ్వక తప్పదా.. కొంపలు ముంచుతున్న ఏఐ..ఫస్ట్ దెబ్బ HCLTech మీదే..
కృత్రిమ మేధస్సు (AI), ఆటోమేషన్ టెక్నాలజీల వేగవంతమైన పురోగతి భారతీయ ఐటీ సేవల రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమ సాంప్రదాయ అవుట్‌సోర్సింగ్ నమూనాలను పునరాలోచించుకుంటూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ (Google).. హెచ్‌సీఎల్‌టెక్ (HCLTech)తో ఉన్న తమ దీర్ఘకాలిక ఇంజనీరింగ్ కాంట్రాక్టులో కీలక కోత విధించింది. అలాగే మెటా (Meta) సైతం విప్రో (Wipro)తో తన కాంట్రాక్టు పరిధిని తగ్గించుకోవడం ఐటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
గత పదేళ్లుగా గూగుల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, ఇంజనీరింగ్ సేవలను హెచ్‌సీఎల్‌టెక్ నిర్వహిస్తోంది. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. గతంలో సంవత్సరానికి 200 మిలియన్ డాలర్లుగా (సుమారు రూ.1,660 కోట్లు) ఉన్న ఈ ప్రాజెక్టు విలువను గూగుల్ ఇప్పుడు తగ్గించింది. దీనివల్ల హెచ్‌సీఎల్‌టెక్ వార్షిక ఆదాయంలో సుమారు $50 మిలియన్ల (రూ. 415 కోట్లు) కోత పడనుంది.

అయితే 14.7 బిలియన్ డాలర్ల భారీ ఆదాయం ఉన్న హెచ్‌సీఎల్‌టెక్‌కు ఇది పరిమిత ప్రభావమే అని భావించినప్పటికీ, ఒక గ్లోబల్ దిగ్గజం అవుట్‌సోర్సింగ్‌ను ఆటోమేట్ చేయడం ఐటీ పరిశ్రమలో మారుతున్న భవిష్యత్ ధోరణికి అద్దం పడుతోంది. ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్న దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగించకుండా ఏఐ, క్లౌడ్ సేవలు, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి అధిక డిమాండ్ ఉన్న విభాగాలకు బదిలీ చేసేందుకు కంపెనీ చర్యలు చేపడుతోంది.
ఇదే విధమైన ఒత్తిడిని మరో ఐటీ దిగ్గజం విప్రో కూడా ఎదుర్కొంటోంది. సోషల్ మీడియా దిగ్గజం మెటా, తన డిజిటల్ మార్కెటింగ్ కార్యకలాపాల ప్రాసెస్ మార్చడంతో విప్రోకి ఉన్న కాంట్రాక్ట్ వ్యాపారంలో 25 శాతం కోత పడింది. దీనితో మెటా నుంచి విప్రోకు వచ్చే వార్షిక ఆదాయం $100 మిలియన్ల నుండి $75 మిలియన్లకు క్షీణించినట్లు మింట్ నివేదించింది.
ఇంతకాలం వేలాది మంది ఇంజనీర్లపై ఆధారపడి నడిచిన సాంప్రదాయ ఐటీ అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్టుల స్థానంలో, తక్కువ వనరులతో ఆటోమేషన్ ద్వారా వేగవంతమైన ఫలితాలను ఇచ్చే భాగస్వాముల కోసం గ్లోబల్ కంపెనీలు వెతుకుతున్నాయి. నాన్-కోర్, సాధారణ సేవలను ఏఐ సాధనాల ద్వారా కంపెనీలు సొంతంగానే పూర్తి చేసుకుంటుండటంతో భారతీయ ఐటీ కంపెనీలు కూడా కేవలం మ్యాన్ పవర్ అందించడమే కాకుండా ఏఐ నైపుణ్యాలను పెంపొందించుకోవడం అనివార్యంగా మారింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.ఐటీ


Click it and Unblock the Notifications
