AI ఉద్యోగాలు: ఇండియాలో పోవడం కాదు, పెరుగుతున్నాయి! షాకింగ్ రిపోర్ట్
ఇండియా, అమెరికా, బ్రిటన్, వియత్నాం, ఫిలిప్పీన్స్... ఇలా ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవల రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఓ కుదుపు కుదిపేస్తోంది. ఏఐ టెక్నాలజీతో చాలా పనులను ఆటోమేట్ చేయొచ్చు కాబట్టి, ఉద్యోగుల అవసరం రోజురోజుకీ తగ్గిపోతోందన్నది అందరికీ తెలిసిన విషయమే.
ఈ కారణంగానే అమెరికా, బ్రిటన్ వంటి పెద్ద దేశాల్లోని టెక్ కంపెనీలు కళ్లు మూసుకుని ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కానీ, ఇండియాలో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉందని నోమురా హోల్డింగ్స్ సంస్థ తన అధ్యయనంలో తేల్చింది.
ప్రపంచంలో మరే దేశంలోనూ లేనివిధంగా, ఇండియాలో ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్న వారి కంటే.. ఏఐ కోసమే కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని నోమురా హోల్డింగ్స్ తన రిపోర్ట్‌లో వెల్లడించింది.
ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయన్న భయాలను ఈ ఒక్క విషయం ప్రశ్నార్థకంగా మార్చేసింది. ప్రస్తుతం టెక్ ఉద్యోగుల మధ్య ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

దీంతో, ప్రపంచ దేశాలకు భారత్ ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఏఐ వల్ల కేవలం ఉద్యోగాలు పోతాయనే అపోహ ఉన్న తరుణంలో, కొత్త ఉద్యోగాలను ఎలా సృష్టించవచ్చో, జాబ్ మార్కెట్‌లో సమతుల్యతను ఎలా సాధించవచ్చో చెప్పడానికి ఇండియా ఒక 'రియల్-వరల్డ్ టెస్ట్ కేస్'గా మారింది.
ప్రపంచ దేశాలకు 'బ్యాక్ ఆఫీస్'గా పేరుగాంచిన ఇండియాలో ఎన్నో రకాల, ఎన్నో రంగాలకు చెందిన ఐటీ సేవలు అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐ టెక్నాలజీ వల్ల ఇక్కడ పెద్ద ఎత్తున నష్టం జరిగి ఉండాలి.
కానీ ఏఐ ఆధారిత నియామకాలు, తొలగింపులు, నియామకాల నిలిపివేత, కొత్త ఉద్యోగాల డిమాండ్‌లో మార్పులు వంటివన్నీ పరిశీలించినప్పుడు.. ఇండియాలో ఏఐ వల్ల జాబ్ మార్కెట్‌పై 'జీరో ఇంపాక్ట్' (సున్నా ప్రభావం) ఉందని నోమురా తన నివేదికలో పేర్కొంది.
2022 నుంచి 2026 మధ్య కాలంలో ఏఐ కారణంగా 31,921 మంది ఉద్యోగాలు కోల్పోగా, సుమారు 83,100 మంది ఏఐ సంబంధిత పనుల్లో నియమితులయ్యారు. అంటే, కోల్పోయిన ఉద్యోగాల కంటే ఏకంగా 2.5 రెట్లు ఎక్కువ కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.
ఇక ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది సపోర్ట్, కస్టమర్ సర్వీస్ విభాగాలకు చెందినవారే. దీనికి ప్రధాన కారణం.. ప్రస్తుతం ఏఐ ఆధారిత స్మార్ట్ చాట్‌బాట్‌లు, ఆటోమేషన్ టూల్స్ అందుబాటులోకి రావడమేనని, అందుకే ఈ విభాగాల్లోని ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమయ్యారని నోమురా తన నివేదికలో వివరించింది.
అయితే, ఏఐ వల్ల ఇండియాలో అసలు నష్టమే లేదా? అంటే.. కచ్చితంగా ఉంది. ఇండియా సహా పలు దేశాల్లోని ఐటీ సేవల రంగంలో ఉద్యోగాలను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఎంట్రీ లెవెల్ ఉద్యోగులు, రెండు అనుభవం ఉన్న ఉద్యోగులు.
ఏఐ టెక్నాలజీ వచ్చాక ఫ్రెషర్లు, ఎంట్రీ లెవెల్ (0-2 ఏళ్ల అనుభవం) ఉద్యోగులకు డిమాండ్ భారీగా పడిపోయింది. ఎందుకంటే, వారు చేసే చాలా పనులను ఇప్పుడు చాట్‌బాట్‌లు లేదా ఆటోమేషన్ ద్వారా సులభంగా పూర్తి చేయవచ్చు. అందుకే వీరి అవసరం బాగా తగ్గింది.
అదే సమయంలో, అనుభవం ఉన్న ఉద్యోగులకు, ముఖ్యంగా ఏఐకి సంబంధించిన కొద్దిపాటి నైపుణ్యాలు ఉన్నవారికి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది.
ఇంకా, ఆసియా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని నోమురా చేసిన మరో అధ్యయనంలో, ఆసియా వ్యాప్తంగా ఏఐకి సంబంధించి 1,30,758 ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. వీటిలో 90 శాతం టెక్ రంగంలోనే ఉన్నాయి. అదే సమయంలో, 60,654 ఉద్యోగాలు తొలగించబడ్డాయి. ఈ తొలగింపుల్లో 60 శాతం కేవలం ఫైనాన్షియల్ రంగంలోనే జరిగాయి.


Click it and Unblock the Notifications
