మొదలైపోయిన ఏఐ (AI) దండయాత్ర.. భారత్‌లో 37 శాతం ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు మాయం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మీ ఉద్యోగాన్ని తినేస్తుంది".. ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న భయం ఇది. చాట్ జీపీటీ, క్లాడ్, కోడెక్స్ వంటి అధునాతన ఏఐ టూల్స్ వాడకం పెరిగిపోతుండటంతో.. భవిష్యత్తులో ముఖ్యంగా ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనని అంతా భావించారు. అయితే, ఈ మార్పు భవిష్యత్తులో కాదు.. ఆల్రెడీ జరిగిపోయిందని చెప్తోంది ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ (Cognizant) , పియర్సన్ సంయుక్తంగా నిర్వహించిన తాజా స్టడీ. ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మూడింట ఒక వంతు ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలను ఇప్పటికే ఏఐ సిస్టమ్స్ రీప్లేస్ చేసేశాయి.

భారత్‌లో మరింత స్పీడ్!
ప్రపంచవ్యాప్తంగా సగటున 33 శాతం ఎంట్రీ-లెవల్ పనులను ఏఐ చూసుకుంటుంటే.. భారతదేశంలో ఈ సంఖ్య ఏకంగా 37 శాతంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే పాశ్చాత్య దేశాల కంటే భారతీయ కంపెనీలు చాలా వేగంగా ఏఐ సాంకేతికతను తమ రోజువారీ పనుల్లోకి అడాప్ట్ చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. టీసీఎస్ వంటి దిగ్గజాలు కొత్త రిక్రూట్‌మెంట్లు తగ్గించడం, మెటా వంటి గ్లోబల్ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగాల కోత విధించిన తరుణంలో ఈ నివేదిక రావడం గమనార్హం. ఇండియా, యూకే, యూఎస్‌లలోని దాదాపు 750 మంది హెచ్ఆర్ (HR) లీడర్ల అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వేను రూపొందించారు. ఇందులో 18 శాతం మంది ప్రతినిధులు.. తమ కంపెనీల్లోని సగానికి పైగా ప్రాథమిక పనులను ఏఐ కే అప్పగించేశామని ఓపెన్‌గా ఒప్పుకున్నారు.
ఉద్యోగాలు పోతున్నాయా? రూపాంతరం చెందుతున్నాయా?
అయితే, ఈ మార్పు వల్ల ఎంట్రీ-లెవల్ AI ఉద్యోగాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని కంగారుపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. ఏఐ వల్ల ఉద్యోగులపై సాధారణ పనుల భారం తగ్గి, వారు మరింత విలువైన (Higher-value) ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టే అవకాశం దొరుకుతుంది.
- మేనేజర్లుగా మారనున్న ఉద్యోగులు: సర్వేలో పాల్గొన్న 96 శాతం మంది హెచ్‌ఆర్‌లు.. రాబోయే ఐదేళ్లలో ఎంట్రీ-లెవల్ పొజిషన్స్ అన్నీ 'ఏఐ సిస్టమ్స్‌ను సూపర్‌వైజ్ చేసే' లేదా 'మేనేజ్ చేసే' ఉద్యోగాలుగా మారిపోతాయని అంచనా వేస్తున్నారు.
- కొత్త రోల్స్ క్రియేషన్: 94 శాతం మంది ప్రతినిధులు.. ఇప్పటివరకు మార్కెట్లోనే లేని సరికొత్త ఉద్యోగాలను ఏఐ సృష్టిస్తుందని నమ్ముతున్నారు.
ఓపెన్ ఏఐ (OpenAI) సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ కూడా గతంలో ఉద్యోగాల నష్టంపై హెచ్చరించినప్పటికీ, తాజాగా తన మాట మార్చారు. "ప్రస్తుతం ఏఐ టూల్స్‌ను ఎక్కువగా వాడుతున్న కంపెనీలే.. కొత్త ఉద్యోగులను కూడా ఎక్కువగా హైర్ చేసుకుంటున్నాయి" అని ఆయన పేర్కొన్నారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ.. ఏఐ వల్ల ఉద్యోగాలన్నీ పోతాయని ముందే ఒక ముగింపునకు వచ్చేవాళ్లు తప్పుగా ఆలోచిస్తున్నారని విమర్శించారు.
ఇప్పుడు కంపెనీలకు ఎలాంటి నైపుణ్యాలు (Skills) కావాలి?
వర్క్‌ఫోర్స్‌లో AI ప్రాధాన్యత పెరిగిన తర్వాత కంపెనీల రిక్రూట్‌మెంట్ స్ట్రాటజీ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు కంపెనీలు టెక్నికల్ నాలెడ్జ్ కంటే 'హ్యూమన్ స్కిల్స్' (మానవ నైపుణ్యాలు) కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి.
- సర్వే ప్రకారం 97 శాతం మంది హెచ్‌ఆర్‌లు.. కమ్యూనికేషన్, లీడర్‌షిప్ వంటి 'సాఫ్ట్ స్కిల్స్' (Soft Skills) ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
- 67 శాతం మంది.. గతంలో కంటే ఇప్పుడు 'లిబరల్ ఆర్ట్స్' డిగ్రీలు ఉన్నవారిని ఎక్కువగా గౌరవిస్తున్నట్లు తెలిపారు.
దీనితో పాటు, నాన్-టెక్నికల్ ఉద్యోగాలకు కూడా ఏఐ పరిజ్ఞానం ఉండటం తప్పనిసరి అవుతోంది. ఇండియాలోని 91 శాతం సంస్థలు.. టెక్నికల్ రంగానికి చెందని అభ్యర్థులకు కూడా ఏఐ స్కిల్స్ ఉండాలని కోరుకుంటున్నాయి. అయితే, ఏఐ ఆధారిత పని వాతావరణానికి సరిపోయే సరైన ప్రతిభ గల అభ్యర్థులను వెతకడంలో 61 శాతం కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా ఏఐ అప్‌స్కిల్లింగ్ (Upskilling) కోసం కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నారు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా మనల్ని మనం అప్‌డేట్ చేసుకోకపోతే మాత్రం రేపటి రేసులో వెనుకబడిపోవడం ఖాయం!


Click it and Unblock the Notifications