AI గురించి భయపడకుండా నేర్చుకోండి.. ఉద్యోగం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందంటున్న నారాయణ మూర్తి..
ఇప్పుడు ప్రపంచంలొ హాట్ టాఫిక్ అంశం ఏదైనా ఉందంటే అది AI గురించే. ప్రతి రంగంలోకి అది దూసుకుపోయి అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఉద్యోగులు అయితే భయం భయంగా కాలం గడుపుతున్నారు. చాలామంది ఇప్పటికే దారి బారీన పడి విలవిలలాడుతున్నారు. తాజాగా దీని మీద నారాయణ మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు N.R. Narayana Murthy మనీకంట్రోల్ తో మాట్లాడుతూ.. AI అనేది ఉద్యోగాలకు ముప్పు కాదు, అది తెలివైనవారికి ఒక శక్తివంతమైన సాధనమని చెప్పుకొచ్చారు.
తన వ్యక్తిగత అనుభవాన్ని ఉదాహరణగా చెబుతూ.. జనరేటివ్ AI ఉపయోగించడం వల్ల పని నాణ్యత (quality), ఉత్పాదకత (productivity) గణనీయంగా పెరుగుతాయని ఆయన అన్నారు. ముఖ్యంగా ఆలోచనాత్మకంగా పనిచేసే, కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న యువతకు ఇది గొప్ప అవకాశమని స్పష్టం చేశారు. AI రావడంతో ప్రపంచం అంతం అవుతుందని అనుకోవడం తప్పని నారాయణ మూర్తి స్పష్టంగా చెప్పారు.

యువత ఈ టెక్నాలజీని భయపడకూడదు. దాన్ని అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి, తమ పనిలో సహాయకంగా ఉపయోగించుకోవాలి. AI ని సరిగ్గా ఉపయోగిస్తే కొత్త ఆలోచనలు, కొత్త రంగాలు త్వరగా నేర్చుకునే అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. అంటే, కష్టపడి పనిచేసే, తెలివైన వ్యక్తులకు AI ఒక శత్రువు కాదు, ఒక సహాయకుడు అని చెప్పుకొచ్చారు. ఇంతకుముందు కూడా నారాయణ మూర్తి సాంకేతిక మార్పులపై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు.
టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుందని, అయితే ఈ మార్పుల మధ్య నిలకడగా ఉండే ఒక్క విషయం నేర్చుకునే సామర్థ్యం మాత్రమేనని ఆయన విశ్వసిస్తారు. ప్రతి ప్రొఫెషనల్ జీవితంలో నిరంతర అభ్యాసం (continuous learning) కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
AI మనం పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది. మానవులు చేయడానికి రోజులు పట్టే పనులను AI కొన్ని నిమిషాల్లో పూర్తి చేయగలుగుతోంది. ఇదే కారణంగా కంపెనీలు AI సాధనాలను వేగంగా స్వీకరిస్తున్నాయి. దీనితో పాటు, AI నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులపై డిమాండ్ కూడా పెరుగుతోంది. అంటే AI ఉద్యోగాలను తొలగించడం కంటే, కొత్త రకమైన ఉద్యోగాలను సృష్టిస్తోంది.ఇది ఐటీ రంగానికే పరిమితం కాకుండా తయారీ, బ్యాంకింగ్, ఆరోగ్యం, విద్య, మీడియా వంటి అనేక రంగాలపై ప్రభావం చూపుతోంది.
ఇటీవల ఢిల్లీలో జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో కూడా నిపుణులు ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. AI ను ఎలా ఉపయోగిస్తామన్నదే అసలు కీలకమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి Narendra Modi కూడా మాట్లాడుతూ, AI ప్రయోజనాలు సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరాలని అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండాలని, యువత దీనిని నేర్చుకుని దేశ అభివృద్ధికి ఉపయోగించాలని ఆయన సూచించారు.


Click it and Unblock the Notifications