ఏఐ బబుల్‌లో చికుక్కున్న రూ. 332 లక్షల కోట్లు.. మార్కెట్ పెను సంక్షోభంపై సిటాడెల్ అధినేత తీవ్ర హెచ్చరిక..
AI Bubble Warning: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతపై అంతర్జాతీయ వ్యాపార ప్రపంచం చూపుతున్న అమితాసక్తి.. భారీగా కుమ్మరిస్తున్న మూలధన వ్యయం క్రమంగా ఒక భారీ బబుల్ (Bubble) రూపాన్ని సంతరించుకుంటోందనే భయాందోళనలు గ్లోబల్ మార్కెట్లలో తీవ్రమవుతున్నాయి. ప్రముఖ బిలియనీర్ ఇన్వెస్టర్, హెడ్జ్ ఫండ్ దిగ్గజం సిటాడెల్ (Citadel), మార్కెట్ మేకర్ సిటాడెల్ సెక్యూరిటీస్ అధినేత కెన్ గ్రిఫిన్ మంగళవారం న్యూయార్ట్‌లో జరిగిన ఫ్యూచర్ ఆఫ్ గ్లోబల్ మార్కెట్స్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ప్రస్తుత ఏఐ పెట్టుబడుల వెల్లువ ఒక బబుల్‌ను తలపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చారిత్రాత్మకంగా సంభవించిన ప్రతి ప్రధాన ఆర్థిక విప్లవం లేదా సాంకేతిక పరిణామం సాధారణంగా ఒక బబుల్‌తోనే ముడిపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఏఐ పరిశ్రమలో ప్రస్తుతం కనిపిస్తున్న విపరీతమైన పెట్టుబడి వాతావరణాన్ని 1990ల చివరి నాటి 'డాట్-కామ్' (Dot-Com) యుగంతో కెన్ గ్రిఫిన్ పోల్చారు. ఆ సమయంలో ఇంటర్నెట్ ఆధారిత వ్యాపారాల పట్ల ఊహించని ఉత్సాహంతో ఇన్వెస్టర్లు వాస్తవిక ఆదాయాలను పట్టించుకోకుండా నిధులు గుప్పించారని, చివరికి ఆ బబుల్ పగిలిపోయి మార్కెట్లు ఘోరంగా కుప్పకూలాయని గుర్తుచేశారు. అయితే, ఆ కాలాన్ని ప్రస్తావిస్తూ తాను అప్పట్లో అమెజాన్ (Amazon) షేర్లను విక్రయించకుండా తన వద్దే అట్టిపెట్టుకున్నందుకు ఇప్పటికీ పశ్చాత్తాపపడుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు.

ఒక బబుల్ సమయంలో పెట్టుబడి పెట్టడం తీవ్ర ప్రమాదకరమే అయినప్పటికీ, తీవ్ర అనిశ్చితిని తట్టుకుని నిలబడే కొన్ని బలమైన కంపెనీలు సుదీర్ఘ కాలంలో అద్భుత విజయాన్ని సాధించగలవని గ్రిఫిన్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో దావోస్ సదస్సులో, మే నెలలో స్టాన్‌ఫోర్డ్ బిజినెస్ స్కూల్‌లో మాట్లాడినప్పుడు ఏఐ సాంకేతిక సాధనాల సామర్థ్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన గ్రిఫిన్, ప్రస్తుతం ఏఐ మార్కెట్ కచ్చితంగా బబుల్ దశలోనే ఉందని బలంగా చెప్తుండటం మార్కెట్ దృష్టిని ఆకర్షించింది.
మరోవైపు ప్రముఖ అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ (Gartner) కూడా ఏఐ రంగానికి సంబంధించి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యం దానికి ఉన్న నమూనా డిమాండ్‌ను మించిపోయిందని నివేదిక పేర్కొంది.
కంపెనీలు ఏఐ నమూనాల అభివృద్ధికి, రన్నింగ్‌కు అవసరమయ్యే ప్రాసెసింగ్ చిప్‌లు, డేటా సెంటర్లు, క్లౌడ్ మౌలిక సదుపాయాలపై విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నప్పటికీ.. ఆ పెట్టుబడుల నుంచి వస్తున్న ఆదాయాలు, ఉత్పాదకత లాభాలు మాత్రం ఆశించిన వేగంతో రావడం లేదని స్పష్టం చేసింది.
ఫలితంగా 2027, 2030 మధ్య కాలంలో ప్రణాళిక చేసిన భారీ మూలధన వ్యయాలపై లాభదాయకమైన రాబడి లభించకపోవచ్చని.. దాదాపు $3.5 ట్రిలియన్ల (రూ. 332.5 లక్షల కోట్లు) పెట్టుబడి ప్రమాదంలో పడే అవకాశం ఉందని గార్ట్నర్ అంచనా వేసింది.
దీర్ఘకాలిక పోటీలో నిలదొక్కుకోవడానికి కంపెనీలు విపరీతంగా పెట్టుబడులు పెడుతున్నప్పటికీ.. ఈ రేసు చివరకు మార్కెట్‌ను కేవలం రెండు ప్రధాన కంపెనీల ఆధిపత్యానికి పరిమితం చేసే అవకాశం ఉందని గార్ట్నర్ విశ్లేషించింది. ఈ క్రమంలో ఏఐ, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ కోసం ప్రత్యేకమైన క్లౌడ్ మౌలిక సదుపాయాలను అందించే 'నియోక్లౌడ్' (Neocloud) కంపెనీల మధ్య విలీనాలు, కొనుగోళ్లు (M&A) రాబోయే రోజుల్లో మరింత వేగవంతం కానున్నాయి.
మొత్తంమీద చూసినట్లయితే ఏఐ సాంకేతికత సామర్థ్యంపై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆశాభావం ఉన్నప్పటికీ, కంపెనీలు కుమ్మరిస్తున్న భారీ పెట్టుబడులకు తగిన రీతిలో వాస్తవ ఆదాయాలు, లాభాలు రాకపోతే ఏఐ సంబంధిత టెక్ షేర్లలో ఉన్న అధిక విలువలు (Valuations) ఒక్కసారిగా కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
