AI ఆటోమేషన్: 15 గంటల పని 1 నిమిషంలో చేస్తే,.. ఉద్యోగికి షాక్!
ఐటీ, టెక్ సేవల రంగాలనే కాదు, ఇప్పుడు చాలా రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం సాధారణమైపోయింది. పనులను ఆటోమేట్ చేయడానికి దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఇలాగే ఏఐ ఆటోమేషన్ ద్వారా తన పనిని సులభతరం చేసుకున్న ఓ ఉద్యోగికి ఎదురైన వింత అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
ఆ ఉద్యోగి చెప్పిన దాని ప్రకారం, ప్రతి వారం చివర్లో అతను ఒక వీక్లీ రిపోర్ట్ సమర్పించాలి. ఈ రిపోర్ట్ తయారు చేయడానికి చాలా చోట్ల నుంచి సమాచారం సేకరించి, దాన్ని సరైన ఫార్మాట్‌లో సెట్ చేయాల్సి ఉంటుంది. ఈ రిపోర్ట్ తయారు చేయడానికి కనీసం 15 గంటల సమయం పట్టేది.
ప్రతి వారం అదే పని చేయడం చాలా కష్టంగా, విసుగ్గా అనిపించింది. దీంతో, ఒక వీకెండ్‌లో ఈ వీక్లీ రిపోర్ట్ తయారు చేసే పనిని ఏఐతో ఆటోమేట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం ప్రత్యేకంగా ఒక స్క్రిప్ట్ రాశాడు. ఫలితంగా, 15 గంటల పనిని కేవలం ఒక్క నిమిషంలోనే పూర్తి చేయగలిగాడు.

ఈ ఆటోమేషన్ సరిగ్గా పనిచేస్తుందో లేదోనని ఆ ఉద్యోగి రెండు వారాల పాటు గమనించాడు. ఈ మధ్యలో మరికొన్ని కొత్త నైపుణ్యాలను కూడా నేర్చుకున్నాడు. కానీ, ఆ తర్వాతే అసలు ట్విస్ట్ మొదలైంది.
తన ఏఐ ఆటోమేషన్ గురించి మేనేజర్‌కు చెబితే జీతం పెంపు, ప్రమోషన్ వస్తుందని ఆ ఉద్యోగి ఎంతో ఆశపడ్డాడు. కానీ, అతనికి షాక్ తగిలింది. 15 గంటల పనిని 1 నిమిషంలో చేయవచ్చని తెలుసుకున్న యాజమాన్యం, ఉద్యోగులు చేసే పనిని గౌరవించకుండా అదనపు పనులు అప్పగించడం మొదలుపెట్టింది.
అంతేకాదు, కంపెనీలో ప్రతి ఒక్కరూ ఏఐ ఆటోమేషన్ వాడాలనేది ఒక ప్రాథమిక నియమంగా మారిపోయిందని ఆ ఉద్యోగి వాపోయాడు.
ఉదాహరణకు, సీనియర్ ఉద్యోగులు ఎవరైనా పని మానేస్తే, వారి స్థానంలో కొత్త వారిని తీసుకోకుండా, ఆ పనిని మిగతా ఉద్యోగులకు పంచుతున్నారు. ఇలా ప్రతి ఉద్యోగి ఏఐ ఆటోమేషన్ ద్వారా తమ పనిని మెరుగుపరచుకోవడం తప్పనిసరిగా మారింది.
ఈ ఆటోమేషన్ చేసిన ఉద్యోగికి కంపెనీలోని ఇతర టీమ్‌ల నుంచి కూడా రకరకాల రిక్వెస్ట్‌లు రావడం మొదలైంది. దీంతో వారికి కూడా సహాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా, ఆ కంపెనీలో ఉద్యోగులు వారానికి 50 గంటలు పనిచేయాల్సిన దుస్థితి నెలకొందని అతను చెప్పాడు.
ఏఐ ఆటోమేషన్ చేసినందుకు అదనపు జీతం, ప్రమోషన్ వంటివి ఏమీ ఇవ్వకుండా.. పని భారాన్ని మాత్రం పెంచడంతో ఆ ఉద్యోగి తీవ్ర నిరాశలో మునిగిపోయాడు.
ఈ పరిస్థితి ప్రతి ఉద్యోగిలో ఒక ప్రశ్నను రేకెత్తిస్తోంది. ఏఐ ద్వారా ఒక పనిని వేగంగా, సమర్థవంతంగా పూర్తి చేస్తే.. కంపెనీ అదనపు పనిని అప్పగించాలా? లేక ఆ ఉద్యోగి నైపుణ్యాన్ని గుర్తించి, జీతం పెంచి ప్రోత్సహించాలా?
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో పేరు, కంపెనీ వివరాలు లేకుండానే షేర్ చేయబడినప్పటికీ, ఇది చాలా మంది ఉద్యోగుల మదిలో ఉన్న ప్రశ్నే. ఏఐ ఆటోమేషన్ ఉద్యోగుల పని భారాన్ని తగ్గించి, వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఉద్దేశించినా.. కంపెనీలు దానిని అదనపు భారం మోపడానికి వాడుకోవడం పెద్ద సంక్షోభంగా మారుతోంది.


Click it and Unblock the Notifications
