ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుప్పకూలిన వీడియో, మేడే అని పైలెట్ అరిచిన క్షణాల్లోనే.. దాని అర్థం ఏంటంటే..
Ahmedabad Air India Plane Crash: గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. 242 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ సభ్యులున్న ఈ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోయింది. కాగా అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI171, కూలిపోయే ముందు గరిష్టంగా 625 అడుగుల ఎత్తుకు చేరుకుందని Flightradar24 షేర్ చేసిన డేటా చెబుతోంది.
242 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం అహ్మదాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని మేఘనినగర్ ప్రాంతంలో కుప్పకూలింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలి మంటల్లో చిక్కుకున్నట్లు కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానంలో 169 మంది ఇండియన్లు, 53 మంది లండన్ వాసులు, 1 కెనడియన్ జాతీయుడు, 7 మంది పోర్చుగీస్ జాతీయులు ఉన్నారు. ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ ఘటనను ఎయిర్ ఇండియా ధృవీకరించింది. అహ్మదాబాద్-లండన్ గాట్విక్‌ను నడుపుతున్న ఫ్లైట్ AI171 గురువారం ప్రమాదంలో చిక్కుకుందని ఎయిర్ ఇండియా తెలిపింది.దర్యాప్తు కోసం ఒక బృందాన్ని సంఘటనా స్థలానికి తరలించినట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ తెలిపింది. ఈ విమానం కెప్టెన్ సుమీత్ సభర్వాల్ నేతృత్వంలో ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ నడుపుతున్నారు. కెప్టెన్ సుమీత్ సభర్వాల్ 8200 గంటల అనుభవం కలిగిన LTC ఫైలెట్ కాగా.. కోపైలట్‌కు 1100 గంటల విమానం నడిపిన అనుభవం ఉందని అధికారి తెలిపారు.
అయితే ఇలాంటి విమాన ప్రమాదాలలో తరచుగా గుర్తుకు వచ్చేది మేడేకాల్. విమానం తీవ్ర ప్రమాదంలో ఉన్నప్పుడు పైలెట్ ఈ పదాన్ని వాడుతుంటారు. అహమ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంలో కూడా పైలెట్లు మేడే కాల్ వాడారు. I need help అంటూ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. ఆ తరువాత విమానంతో ఏటీసీకి సంబంధాలు తెగిపోయాయి. ఏటీసీ పదే పదే సమాచారాన్ని పంపించినప్పటికీ కాక్ పిట్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఆ వెంటనే భారీ శబ్దం రావడం, మంటలు చెలరేగడం, దట్టమైన పొగ వెలువడటంతో విమానం కూలిపోయిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు.
ఇంతకీ మేడే అంటే ఏమిటి? దాని అర్థం ఏమిటి: మేడే అనేది పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి ఈ క్రింది సందర్భాలలో చేసే అత్యవసర కాల్. విమానంలో సాంకేతిక లోపం ఏర్పడినా కాని, ఇంజిన్ వైఫల్యం లేదా విమానంలో మంటలు, క్రాష్ ల్యాండింగ్ సమయంలో పైలెట్లు ఈ పదాన్ని వాడుతారు. ఆ పదాన్ని రేడియోలో వరుసగా మూడుసార్లు - "మేడే, మేడే, మేడే" అని చెబుతారు. పైలట్లు ఏటీసీకి మేడే కాల్ చేయగానే తమకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఏటీసీకి వారు వివరిస్తారు.
పైలట్ మేడే సంకేతాన్ని పంపించారంటే.. విమానం లేదా దానిలోని ప్రయాణికులకు ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని అర్థం చేసుకోవాలి. విమాన ప్రయాణాల్లో పైలట్లు మేడే (MAYDAY) అని పలకడం అంటే విమానం తీవ్రమైన ప్రమాదంలో ఉందని లేదా అత్యవసర స్థితిని సూచించే అంతర్జాతీయ రేడియో దిస్ట్రెస్ సిగ్నల్. ఈ పదం ఫ్రెంచ్ పదం m'aider (మీ ఆయిదర్) నుండి వచ్చింది. దీని అర్థం "నాకు సహాయం చేయండి" అని విమానయాన నిపుణులు చెబుతున్నారు.
1920లలో ఫ్రెంచ్ ఏవియేషన్ రేడియో అధికారి ఫ్రెడరిక్ స్టాన్లీ మాక్‌ఫోర్డ్ ఈ పదాన్ని అత్యవసర సిగ్నల్‌గా ప్రతిపాదించారు. ఆ సమయంలో లండన్- పారిస్ మధ్య విమాన ట్రాఫిక్ గణనీయంగా పెరిగింది. ఆ సమయంలో "నాకు సహాయం చేయి" అనే అర్థం వచ్చే ఫ్రెంచ్ పదం "మైడర్"..ఈ మేడేను స్వీకరించడానికి ప్రేరణగా నిలిచింది. ఆ తరువాత ఇది అంతర్జాతీయ విమానయాన కమ్యూనికేషన్‌లో భాగమైంది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) ద్వారా అధికారిక అత్యవసర కాల్ సిగ్నల్‌గా గుర్తించడం జరిగింది.


Click it and Unblock the Notifications