Air India Flight Crash at Ahmedabad: గుజరాత్ లోని అహమ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి విదితమే. 242 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ సభ్యులున్న ఈ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే గాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ విషాదకర సంఘటనతో యావత్ భారతం తీవ్ర విషాదంలోకి వెళ్లింది.. ఈ విషాద ఘటన వార్తల మధ్య నేడు విమానయాన స్టాక్స్ కూడా కుప్పకూలాయి.
బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో), స్పైస్‌జెట్ షేర్లు దాదాపు 3.4% వరకు పడిపోయాయి. ఇక NSEలో ఇండిగో షేర్లు ఈరోజు ఇంట్రాడేలో 3.4% తగ్గి రూ. 5,437.50 కనిష్ట స్థాయికి చేరుకోగా, స్పైస్‌జెట్ షేర్లు 2.6% తగ్గి రూ 44.30కి చేరుకున్నాయి. ఇక TAAL ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ షేర్లు ఈరోజు 4 శాతం తగ్గి రూ.3,566.60కి చేరుకున్నాయి. తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ లిమిటెడ్ షేర్లు 2 శాతం తగ్గి రూ.374.40కి చేరుకున్నాయి.

ఇక హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ షేర్లు 2 శాతం కుప్పకూలాయి. AFCOM హోల్డింగ్స్ లిమిటెడ్ షేర్లు 1 శాతం తగ్గాయి. యునిమెక్ ఏరోస్పేస్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ షేర్లు 4 శాతం దిగువకు పడిపోయాయి. ప్రీ-మార్కెట్ ట్రేడింగ్ సమయంలో న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా చేయబడిన బోయింగ్ కంపెనీ షేర్లు 7 శాతం కంటే ఎక్కువగా కుప్పకూలాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని మేఘనినగర్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం బోయింగ్ విమానాల భద్రత గురించి మళ్ళీ ఆందోళనలను రేకెత్తించడంతో పెట్టుబడిదారులు ఆందోళనకు గురయ్యారు.
అహ్మాదాబాద్‌లో విమానం కూలిన ఘటనపై ఎయిర్ ఇండియా(Air India) స్పందించింది. తన ఎక్స్ అకౌంట్‌లో ప్రమాదం గురించి పోస్టు చేసింది. ఫ్లయిట్ AI171 కూలినట్లు ఎక్స్ వేదికగా ప్రకటించింది. అహ్మాదాబాద్ నుంచి లండన్ గాట్విక్‌కు ఆ విమానం వెళ్తున్నట్లు ఎయిర్ ఇండియా కంపెనీ వెల్లడించింది. జూన్ 12వ, 2025 తేదీన ప్రమాదం జరిగిందని ప్రస్తుతం ఆ దుర్ఘటనకు చెందిన సమాచారాన్ని సేకరిస్తున్నామని, వీలైనంత త్వరలో ఆ విషయాలను తమ ఎక్స్ ఖాతాలో వెల్లడించనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
ఈ విషాద సంఘటనలో మరణించిన వారికి ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో భాధితుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఘటనా స్థలంలో అత్యవసర ప్రతిస్పందన బృందాలకు సహాయం చేయడానికి, బాధితులకు అవసరమైన అన్ని సహాయక చర్యలను అందించడానికి మేము మా శక్తి మేరకు ప్రతిదీ చేస్తున్నామని ఎన్ చంద్రశేఖరన్ అన్నారు.
అత్యవసర సమాచారం కోసం సహాయక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చంద్రశేఖరన్ తెలియజేశారు. ప్రయాణికుల బంధువులకు సహాయం చేయడానికి ఎయిర్‌లైన్స్ ప్రత్యేక సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ తెలిపారు. సమాచారం అందించడానికి ఎయిర్ ఇండియా 18005691444 అనే హాట్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేసింది. కాగా ఈ విమానాన్ని 2016లో ఎయిర్‌లైన్స్ ఫ్లీట్‌లో చేర్చారు.


Click it and Unblock the Notifications