Delivery Boys: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. వారికి పీఎఫ్, ఇన్సూరెన్స్..!
దేశంలోని లక్షలాది మంది గిగ్ వర్కర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. దీపావళి పండుగకు ముందు గిగ్, డెలివరీ ప్లాట్‌ఫారమ్ వర్కర్లకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఆన్‌లైన్ డెలివరీలు, క్యాబ్ సర్వీసులు అందిస్తూ ఎలాంటి ఆర్థిక భద్రత లేకుండా కష్టపడుతున్న వర్కర్ల సంక్షేమం కోసం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ 'నేషనల్ సోషల్ సెక్యూరిటీ బోర్డ్'ను ఏర్పాటు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. స్విగ్గీ, జొమాటో, ఉబర్, ఓలా, ర్యాపిడో లాంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై ఆధారపడి పనిచేసే వర్కర్లతో పాటు, ఇతర అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి ఈ నిర్ణయంతో లబ్ధి పొందనున్నారు.
ఇప్పటివరకు ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన PF, ఇన్సూరెన్స్ వంటి సామాజిక భద్రత సౌకర్యాలు ఉండేవి. ఇప్పుడు గిగ్ వర్కర్లకు కూడా వర్తింపజేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 చట్టం కింద ఏర్పాటైన ఈ బోర్డుకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ స్వయంగా అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఈ బోర్డులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో పాటు, ప్రముఖ కంపెనీల నుంచి 5 మంది, వర్కర్ల తరఫున 5 మంది ప్రతినిధులు సభ్యులుగా ఉండనున్నారు. అంతేకాకుండా ESIC, EPFO అధికారులు, సివిల్ సొసైటీ సభ్యులు, కార్మిక సంఘాల నేతలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉంటారని కేంద్రం తెలిపింది.

ఈ బోర్డు సంవత్సరానికి కనీసం 3 సార్లు సమావేశమై, గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం కొత్త పథకాలను రూపొందిస్తుందని కేంద్రం తెలిపింది. ఆ సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులు ఎక్కడి నుంచి రావాలి, వాటిని ఎలా ఖర్చు చేయాలి అనే అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి తగిన సలహాలు, సిఫార్సులు చేయనుంది. ప్రస్తుతం ఎలాంటి కొత్త పథకాలను ప్రకటించనప్పటికీ భవిష్యత్తులో కార్మికులకు మేలు చేసే స్కీమ్స్ రూపొందించేందుకు ఈ బోర్డు ఒక బలమైన వేదిక కానుంది. సాంప్రదాయ ఆఫీసు ఉద్యోగాలకు బదులుగా తమకు నచ్చిన సమయంలో స్వతంత్రంగా పనిచేస్తూ డబ్బు సంపాదించే వారిని గిగ్ వర్కర్లు గా వ్యవహరిస్తారు.
ఇక జొమాటో, ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి డిజిటల్ యాప్‌ల ద్వారా ఉపాధి పొందే వారిని ప్లాట్‌ఫారమ్ వర్కర్లుగా పిలుస్తారు. ఎలాంటి సామాజిక భద్రత లేకుండా ఎంతో శ్రమిస్తున్న వీరికి పీఎఫ్, ఆరోగ్య భద్రత కల్పించాలని ఏళ్ల తరబడి డిమాండ్ ఉంది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ఈ బోర్డు ఏర్పాటు ద్వారా వారి చిరకాల కోరికను నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications