వెనెజువెలాకు పట్టిన గతే మీకు పడుతుంది.. లాటిన్ అమెరికా దేశాలకు ట్రంప్ వార్నింగ్.. కారణం ఏంటంటే..
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్న తర్వాత.. లాటిన్ అమెరికా దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.వెనిజులా ఘటనతో ఆగిపోకుండా.. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను కారణంగా చూపుతూ మెక్సికో, క్యూబా, కొలంబియా వంటి దేశాలను టార్గెట్ చేశారు. మీరు వైఖరి మార్చుకోకపోతే వెనిజులాకు ఎదురైన పరిస్థితే తప్పదని వార్నింగ్ ఇవ్వడంతో భౌగోళిక ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి.
శనివారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్.. మెక్సికోపై తీవ్ర ఆరోపణలు చేశారు. మెక్సికోను ప్రస్తుతం అక్కడి అధ్యక్షురాలు క్లౌడియా షీన్‌బామ్ పాలించడం లేదని, శక్తివంతమైన డ్రగ్ కార్టెల్స్ దేశాన్ని నడుపుతున్నాయని వ్యాఖ్యానించారు. అమెరికాలోకి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు అక్రమంగా ప్రవేశించడానికి మెక్సికోనే ప్రధాన ద్వారంగా మారిందని.. దీనిని ఇక సహించబోమని ట్రంప్ స్పష్టంగా చెప్పారు. మెక్సికో ఏదో చేయాల్సిందే. లేకపోతే అమెరికా తానే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించడం, భవిష్యత్‌లో మరింత కఠిన చర్యలకు సంకేతంగా భావిస్తున్నారు.

క్యూబాపై కూడా ట్రంప్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. క్యూబాను ఆయన విఫలమైన రాజ్యంగా అభివర్ణించారు. అయితే, క్యూబా ప్రజల పట్ల తనకు సానుభూతి ఉందని, వారికి సహాయం చేయాలని అమెరికా కోరుకుంటోందని తెలిపారు. క్యూబా నుంచి బలవంతంగా వెళ్లగొట్టబడిన వారికి సాయం చేయాలన్న ఉద్దేశం ఉందని ట్రంప్ చెప్పారు. ఒకవైపు మానవతా సహాయం మాటలతో, మరోవైపు కఠిన హెచ్చరికలతో ట్రంప్ క్యూబాపై ఒత్తిడి పెంచుతున్నారని విశ్లేషకులు అంటున్నారు.
ఇక మరో దేశం కొలంబియా విషయానికి వచ్చేసరికి ట్రంప్ ఆరోపణలు మరింత తీవ్రమయ్యాయి. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో కనీసం మూడు భారీ కొకైన్ ఫ్యాక్టరీలకు మద్దతు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్కడ తయారవుతున్న కొకైన్‌ను అమెరికాలోకి అక్రమంగా తరలిస్తున్నారని..ఇకపై ఈ పరిస్థితిని ఇక అంగీకరించబోమని ట్రంప్ అన్నారు. కొలంబియా నుంచి వచ్చే డ్రగ్స్ అమెరికా యువతను నాశనం చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
అలాగే గ్రీన్లాండ్ దేశానికి కూడా వార్నింగ్ ఇచ్చారు. జాతీయ భద్రత కారణాలతో గ్రీన్లాండ్ అమెరికాకు అవసరమని ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. చైనా, రష్యా జలాంతర్గాములు ఆ ప్రాంతంలో తిరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. అయితే గ్రీన్లాండ్ డెన్మార్క్‌లో భాగం కాగా, అది నాటో మిత్రదేశం. డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్, గ్రీన్లాండ్ వంటి స్వయంప్రతిపత్త ప్రాంతాన్ని బెదిరించడం ఆపాలని ట్రంప్‌ను కోరుతూ గట్టి ప్రకటన చేశారు.
ఇక ఇరాన్‌లో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో ట్రంప్ అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజలపై హింస కొనసాగితే, అమెరికా నుంచి తీవ్ర ప్రతిచర్య ఎదురవుతుందని ఆయన అన్నారు. ఇది మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగే అవకాశాన్ని సూచిస్తోంది.
Venezuela పై అమెరికా చేసిన సైనిక చర్యలను కొలంబియా తీవ్రంగా ఖండించింది. ఇది ఒక్క వెనిజులాకే కాకుండా దక్షిణ అమెరికా మొత్తం మీద ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీస్తుందని కొలంబియా హెచ్చరించింది. అమెరికా చర్యలు ప్రాంతీయ సార్వభౌమత్వానికి ముప్పుగా మారుతున్నాయని, లాటిన్ అమెరికాలోని అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని కొలంబియా పిలుపునిచ్చింది. ఏదేమైనా కొత్త సంవత్సరం ప్రారంభంలోనే శాంతి కోరుకుంటున్నానని ప్రకటించిన ట్రంప్.. కొన్ని రోజుల వ్యవధిలోనే పలు దేశాలకు వరుసగా హెచ్చరికలు జారీ చేయడం ప్రపంచ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications