TCS గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగాలను తొలగించడం లేదని కీలక ప్రకటన
ఇటీవల ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) గురించి ఉద్యోగాల ప్రక్రియపై కొన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. గత కొంతకాలంగా 600 మందికి పైగా లేటరల్ హైర్స్ (అనుభవజ్ఞులు) కు ఆఫర్ లెటర్లు ఇచ్చి, వారిని జాయిన్ చేయించడాన్ని కంపెనీ ఆలస్యం చేస్తోంది. ఈ విషయాన్ని తీసుకొని కార్మిక శాఖతో చర్చలు కూడా జరిగాయి.

ఆగస్టు 1న, కేంద్ర ప్రధాన కార్మిక కమిషనర్ కార్యాలయం ఈ విషయం పై ప్రత్యక్ష సమావేశం నిర్వహించింది. అయితే, TCS ఈ సమావేశానికి హాజరుకాకుండా ఈమెయిల్ ద్వారా స్పందించింది. అందులో, TCS స్పష్టంగా చెప్పింది:
"మేము ఇచ్చిన ఆఫర్ లెటర్లను గౌరవిస్తాము. ఈ జాయినింగ్‌లు రద్దు కాదు, కేవలం వాయిదా వేసినవే." ప్రస్తుతం, ఈ ఉద్యోగులను బోర్డింగ్గ్ చేసే ప్రక్రియ జరుగుతోందని కార్మిక శాఖ ఉన్నతాధికారి వెల్లడించారు.
IT ఉద్యోగుల హక్కుల కోసం పనిచేసే నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సినెట్ (NITES) సంస్థ ఇటీవల కార్మిక మంత్రిత్వశాఖకు లేఖ రాసింది. హర్ప్రీత్ సింగ్ సలూజా, NITES అధ్యక్షుడు, లేఖలో ఇలా చెప్పారు "అనేకమంది ఉద్యోగార్థులు ఇతర నగరాలకు మకాం మార్చారు. వారి వ్యక్తిగత, ఆర్థిక ప్రణాళికలు TCSలో ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో చేశారు వారు. కానీ వారు జాయినింగ్ డేట్‌కి రాగానే, కంపెనీ వారు ఊహించని విధంగా 'ఇంకాస్త ఆలస్యం అవుతుంది' అని చెప్పారు. ఎటువంటి అధికారిక సమాచారం, కొత్త జాయినింగ్ డేట్ కూడా ఇవ్వలేదు."
ఈ 600 మందికిపైగా లేటరల్ హైర్స్‌కి 2 నుంచి 18 సంవత్సరాల అనుభవం ఉంది. వారిలో బెంగళూరు, హైదరాబాద్, పుణె, కోలకతా, ముంబయి, ఢిల్లీ వంటి నగరాలకు చెందిన వారు ఉన్నారు.
ఈ సమావేశంలో, TCS ఇటీవల ప్రకటించిన మాస్ లేఆఫ్స్ గురించి చర్చ జరగలేదు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో TCS సుమారు 2 శాతం సిబ్బందిని తగ్గించనుంది అంటే దాదాపు 12,000 ఉద్యోగాలు కోల్పోతే అవాక్కవాల్సిందే. కార్మిక శాఖ అధికారి ప్రకారం, ఈ అంశాన్ని "తర్వాతి సమావేశంలో చర్చిస్తారు" అని తెలిపారు.
TCS వైఖరి ఏమంటోంది?
TCS ప్రతినిధి మాట్లాడుతూ "మా వద్ద ఆఫర్ పొందిన ప్రతి ఒక్కరినీ ఉద్యోగంలోకి తీసుకుంటాం. కానీ జాయినింగ్ తేదీలు వ్యాపార అవసరాల ప్రకారం మారుతుంటాయి. ఇది సాధారణమే" అని చెప్పుకొచ్చింది.
TCS సంస్థ ఇచ్చిన హామీ కొన్ని ఉద్యోగార్థులకు ఊరటనిచ్చినా, ఇంకా స్పష్టత లేని పరిస్థితి కొనసాగుతోంది. జాయినింగ్ తేదీలు ఎప్పుడో తెలియని పరిస్థితి, కుటుంబాలతో సహా మకాం మార్చిన అనేకమంది అభ్యర్థులకు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడిగా మారింది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయాలు, కంపెనీలు సమర్థవంతంగా స్పందించి, స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలి అనే డిమాండ్ మరింత బలంగా వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications