Chillies Prices: టమాటా దారిలోనే పచ్చిమిర్చి.. ఘాటుతో పాటు పెరిగిన రేటు..
Chillies Prices: గత కొన్ని రోజులుగా దేశంలో నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఎన్నడూ చూడని రేట్లకు చేరుకుంటున్నాయి. టమాటా ధరలు సెంచరీ దాటాయని ఆందోళనలో ఉన్న ప్రజలకు కొత్తగా మిర్చి మంటెక్కిస్తోంది.
ఇటీవల దేశంలో రుతుపవనాల రాక కొంత ఆలస్యం కావటంతో నీటి ఎద్దడి ఉత్పత్తిని దెబ్బతీసింది. ఆ తర్వాత విపరీతంగా కురిసిన వానలు పంటను పాడుచేశాయి. దీంతో కూరగాయల దిగుబడి భారీగా దెబ్బతింది. మార్కెట్లో టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ఉల్లి నుంచి మిర్చి వరకు, పప్పు నుంచి బియ్యం వరకు రేట్లు ప్రజలకు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మిర్చి, అల్లం ధర కిలో రూ.400 వరకు పెరిగినట్లు సమాచారం. చెన్నైలో పచ్చిమిర్చి కిలో రూ.100 మాత్రమే ఉండగా.. కోల్ కతాలో పచ్చిమిర్చి, అల్లం రేటు రూ.350కి చేరింది. కొన్ని రోజులుగా మార్కెట్లకు మిర్చి సరఫరా తగ్గిపోయిందని.. అందువల్లే ధరలు విపరీతంగా పెరిగాయని కోయంబేడు హోల్‌సేల్ మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్ లో కనీసం సగం కూడా సరఫరా ఉండటం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రధానంగా ఇతర రాష్ట్రాలకు మిర్చి సరఫరా చేసే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం దిగుబడి భారీగా తగ్గింది. కర్ణాటక, తమిళనాడుకు సైతం ఎగుమతులు ఏపీ నుంచి పడిపోయాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే నెలకొంటంతో చాలా నగరాల్లో కిలో పచ్చిమిర్చి రేటు రూ.400 వరకు పెరిగాయి. మార్కెట్‌లో మిర్చి సరిపడా సరఫరా కాకపోవడంతో ధరలు పెరిగాయి. భారత మిర్చి ఉత్పత్తి మార్కెట్‌లో 60 శాతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆధీనంలోనే ఉన్నాయి. భారతీయ మిర్చి ఉత్పత్తిలో కర్ణాటక 10 శాతం మార్కెట్ వాటాతో 4వ స్థానంలో ఉంది.


Click it and Unblock the Notifications