IT News: ఐటీ ఉద్యోగం అంటేనే ఆశల ఊయల. జీతానికి తగినట్లుగానే ఒత్తిడి ఉంటుందని చాలా మంది టెక్కీలు వాపోతుంటారు. అందుకే ఎక్కువ కాలం అందులో చాలా మంది కొనసాగరు.
ప్రస్తుతం ఐటీ రంగంలోని కంపెనీలు భారీ మందగమనాన్ని ఎదుర్కొంటున్నాయి. రానున్న కాలంలో ఇది మరింతగా పెరుగుతుందనే అంచనాల మధ్య ఇటీవల టీసీఎస్ అక్టోబర్ 1 నుంచి వారంలో 5 రోజులు ఆఫీసు నుంచే పనిచేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. గతంలో టెక్కీలకు అందించిన హైబ్రిడ్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. దీంతో టెక్కీల ఆశలు ఆవిరయ్యాయి.

టీసీఎస్ దారిలోనే దేశంలోని ఇతర టెక్ కంపెనీలైన విప్రో, క్యాప్‌జెమినీ, ఎల్‌టిమైండ్‌ట్రీ కూడా చేరాయి. తమ ఉద్యోగులను సైతం వారానికి 5 రోజులు లేదా వారానికి 3-4 రోజులు కార్యాలయానికి వచ్చేలా చేయడం ప్రారంభించాయి. దీంతో రిమోట్ వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్ గతకాలపు జ్ఞాపకాలుగా మిగిలిపోనున్నాయని తెలుస్తోంది. ఈ కంపెనీలు టీమ్‌ల వారీగా, ప్రాజెక్ట్‌ల వారీగా బిజినెస్ మోడల్ ఉద్యోగులను పిలవడం ప్రారంభించాయి. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ తీసుకున్న చాలా మందికి ఇది పెద్ద సమస్యగా మారనుంది.
ప్రస్తుత ప్రపంచ స్థూల ఆర్థిక సంక్షోభం కారణంగా వ్యాపార వృద్ధిని కొనసాగించేందుకు కొత్త ప్రాజెక్టులను సంపాదించటంలో ఐటీ కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ దశలో IT ఉద్యోగులను నిలుపుకోవాలని, మెరుగైన పనితీరును కనబరిచి ఇప్పటికే ఉన్న కస్టమర్ల నుంచి అదనపు వ్యాపారం, ఆదాయాన్ని ఆకర్షించాలని చూస్తున్నాయి. అందుకే ఉద్యోగులందరినీ తిరిగి ఆఫీసులకు తిరిగి తీసుకురావాలని నిర్ణయించాయి.
అలాగే పూణె, బెంగళూరు, హైదరాబాద్ వంటి దేశంలోని పలు ఐటీ హబ్‌లలో ఉన్న కంపెనీలు టెక్కీలను వారానికి 5 రోజుల పాటు కార్యాలయానికి రావాలని ప్రకటించాయి. దేశంలోని టాప్ ఐటీ కంపెనీలు ఏకకాలంలో తీసుకున్న నిర్ణయం ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రిక్సన్ అండ్ పిన్‌సర్వ్ ఇటీవల ఈ జాబితాలో చేరాయి.


Click it and Unblock the Notifications