Signature Bank: సిలికాన్ వ్యాలీ బ్యాంక్ తర్వాత మూతపడ్డ మరో US బ్యాంక్.. అసలేం జరుగుతోంది..?
Signature Bank: ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే అమెరికా బ్యాంకింగ్ రంగం అతిపెద్ద సంక్షోభానికి దారితీస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల కిందట సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలటం మరువక ముందే మరో బ్యాంక్ ఆందోళనలకు కారణంగా మారింది. అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థలో అసలు ఏం జరుగుతోంది అనే ఆందోళనలు ప్రస్తుతం ప్రపంచాన్ని భయానికి గురిచేస్తున్నాయి.

మూడో అతిపెద్ద ఘటన..
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఘటన తర్వాత.. అమెరికాలో స్టేట్ రెగ్యులేటర్లు ఆదివారం న్యూయార్క్ ఆధారిత సిగ్నేచర్ బ్యాంక్‌ను మూసివేశారు. ఇది అమెరికా బ్యాంకింగ్ చరిత్రలో మూడవ అతిపెద్ద వైఫల్యంగా నిలిచింది. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో కుప్పకూలిన వాషింగ్టన్ మ్యూచువల్ తర్వాత US చరిత్రలో రెండవ అతిపెద్దదిగా ఇది నిలిచింది. ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సిగ్నేచర్ బ్యాంకును తాజాగా తన నియంత్రణలోకి తీసుకున్నట్లు న్యూయార్క్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్పష్టం చేసింది.

డిపాజిట్స్..
తాజాగా సంక్షోభంలోకి నెట్టబడిన సిగ్నేచర్ బ్యాంక్ 110.3 బిలియన్ డాలర్ల ఆస్తులతో పాటు 88.59 బిలియన్ డాలర్ల డిపాజిట్లను కలిగి ఉంది. అయితే ఈ రెండు బ్యాంకుల్లోని డిపాజిటర్లందరి సొమ్ముకు ఢోకా లేదని ఫెడరల్ రిజర్వ్ అభయం ఇచ్చింది. పన్ను చెల్లింపుదారులు ఎటువంటి నష్టాలను భరించరని US ట్రెజరీ డిపార్ట్‌మెంట్, ఇతర బ్యాంక్ రెగ్యులేటర్లు సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.
ప్రత్యేక ఏర్పాట్లు..
FDIC ఆదివారం నాడు "బ్రిడ్జి" సక్సెసర్ బ్యాంక్‌ను స్థాపించింది. ఇది కస్టమర్లు సోమవారం వారి సొమ్మును యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. సిగ్నేచర్ బ్యాంక్ డిపాజిటర్లు, రుణగ్రహీతలు ఆటోమెటిక్ గా బ్రిడ్జ్ బ్యాంక్ కస్టమర్లుగా మారనున్నారు. రెగ్యులేటర్ మాజీ ఫిఫ్త్ థర్డ్ బాన్‌కార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గ్రెగ్ కార్మైచెల్‌ను బ్రిడ్జ్ బ్యాంక్ CEOగా పేర్కొంది. తాజా ఏర్పాట్లతో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కస్టమర్లు నేటి నుంచి తమ డిపాజిట్లను యాక్సెస్ చేసేందుకు అమెరికా అధికారులు ఆందోళనలను తగ్గించే పనిలో ఉన్నారు. సిగ్నేచర్ బ్యాంక్ తన వ్యాపార కార్యకలాపాలను 2001లో ప్రారంభించింది.


Click it and Unblock the Notifications