Sahara: సుబ్రతా రాయ్ మరణంతో సెబీపై ఇన్వెస్టర్ల ఫోకస్.. ఆ 25 వేల కోట్లను ఏం చేస్తారో..?
Sahara: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ తన 75వ ఏట నిన్న రాత్రి ముంబైలో కన్నుమూశారు. పలు స్కీమ్ లను రన్ చేస్తూ నిబంధనలు అతిక్రమించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. సెబీ సూచనలను సమర్థిస్తూ, పెట్టుబడిదారుల నుంచి సేకరించిన డబ్బును 15 శాతం వడ్డీతో తిరిగి చెల్లించమని సుప్రీంకోర్టు సహారా గ్రూపుకు చెందిన రెండు కంపెనీలను గతంలో ఆదేశించింది.
ఇందులో 95 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని ఇన్వెస్టర్లకు నేరుగా రీఫండ్ చేసినట్లు సహారా గ్రూపు చెబుతూ వచ్చింది. అయితే తదుపరి రీఫండ్ కోసం సెబీ వద్ద 24 వేల కోట్లు డిపాజిట్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు గ్రూప్ చీఫ్ మరణంతో సెబీ వద్దనున్న పంపిణీ చేయబడని 25 వేల కోట్ల నిధులపై అందరి దృష్టీ పడింది.

మార్కెట్స్ రెగ్యులేటర్ తాజా వార్షిక నివేదిక ప్రకారం.. రెండు సహారా గ్రూప్ సంస్థల పెట్టుబడిదారులకు 11 ఏళ్లలో సెబీ 138.07 కోట్ల మేర వాపసు చేసింది. తిరిగి చెల్లింపుల కోసం ప్రత్యేకంగా తెరిచిన బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన మొత్తం ఇప్పుడు 25 వేల కోట్లకు పైగా పెరిగింది. ఆ రెండు కంపెనీలకు చెందిన మెజారిటీ బాండ్‌హోల్డర్ల నుంచి క్లెయిమ్స్ లేకపోవడంతో.. గత ఆర్థిక సంవత్సరం సెబీ రీఫండ్ చేసిన మొత్తం కేవలం 7 లక్షలు పెరిగింది.
మార్చి 31, 2023 నాటికి ఈ వ్యవహారంలో 53,687 ఖాతాలకు సంబంధించి 19,650 దరఖాస్తులను సెబీ స్వీకరించింది. వీటిలో 67.98 కోట్ల వడ్డీతో సహా మొత్తం 138.07 కోట్లను 48 వేల 326 ఖాతాలకు సంబంధించిన 17 వేల 526 దరఖాస్తులకు వాపసు చేసింది. సహారా సంస్థలు అందించిన డేటాలో మిగిలిన వాటి రికార్డులు గుర్తించబడనందున.. వాటిని తిరస్కరించింది. కాగా ఇప్పుడు అకౌంట్ లో ఉన్న 25 వేల కోట్లను ఏం చేయనున్నారనే దానిపై చర్చ మొదలైంది.


Click it and Unblock the Notifications