పెట్రో దిగుమతుల కోసం రూ.10 లక్షల కోట్లు: ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు ప్రోత్సాహం: గడ్కరీ
న్యూఢిల్లీ: విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగానికి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ, ఉత్పత్తి- ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రెట్టింపు అవుతూ వస్తోంది. అన్ని ప్రముఖ ఆటోమొబైల్ సెగ్మెంట్స్‌కు చెందిన కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ మీద దృష్టి సారించాయి. దీనికి అనుగుణంగా- పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం, కేంద్ర ప్రభుత్వం స్క్రాప్ పాలసీని అమలులోకి తీసుకుని వచ్చిన తరువాత ఈవీల మీద దృష్టి సారించారు వాహనదారులు.
ఇదివరకెప్పుడూ లేనిసంఖ్యలో ఎలక్ట్రిక్ టూవీలర్స్ రోడ్ల మీద కనిపిస్తోన్నాయి. ఫోర్ వీలర్స్ సంఖ్య కూడా తక్కువేమీ కాదు. మారుతి సుజుకి, కియా, టయోటా.. వంటి టాప్ కార్ మేకర్స్ వీటి తయారీకి ప్రాధాన్యత ఇస్తోన్నాయి. బెంగళూరు వంటి నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థలోనూ ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశించాయి. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ పరిధిలో వందల సంఖ్యలో ఎలక్ట్రిక్ వహనాలు సిటీ బస్సులుగా నడుస్తున్నాయి.

ఇప్పుడు తాజాగా- ఈ సెగ్మెంట్‌లో ట్రాక్టర్లు, భారీ ట్రక్కులు కూడా రాబోతోన్నాయి. రైతాంగ అవసరాల కోసం విద్యుత్‌తో పనిచేసే ట్రాక్టర్లను అందుబాటులోకి తీసుకుని రాబోతున్నామని రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పుణేలోని వసంత్‌దాదా షుగర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన షుగర్ కాన్ఫరెన్స్ 2022కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. త్వరలో ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, ట్రక్కులను తాము చూడబోతున్నామని పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం పెరిగిందని నితిన్ గడ్కరీ అన్నారు. వ్యవసాయ రంగంలో ఎథనాల్ వినియోగాన్ని పెద్ద ఎత్తున తీసుకుని రావడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వ్యవసాయ అవసరాలు, నిర్మాణ రంగానికి చెందిన వాహనాలను ఇథనాల్ ద్వారా నడిపించే రోజులు ఎంతో దూరం లేవని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రతి సంవత్సరం 10 లక్షల కోట్ల రూపాయలను ఇంధన దిగుమతి కోసం ఖర్చు చేయాల్సి వస్తోందని, వచ్చే అయిదేళ్లలో ఈ సంఖ్య 25 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని చెప్పారు.


Click it and Unblock the Notifications