ఇటీవల TCS (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) తీసుకున్న కీలక నిర్ణయాలు టెక్ రంగాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. కంపెనీ ఇప్పటికే 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, ఇప్పుడు వేతన పెంపులపై బ్రేక్ వేసేందుకు సిద్ధమవుతోంది. కొత్తగా సీనియర్ ఉద్యోగులను తీసుకోవడం కూడా తాత్కాలికంగా నిలిపివేయనుందనే వార్తలు వస్తున్నాయి.

ఇకపై టీసీఎస్ కొత్తగా అనుభవజ్ఞులైన వ్యక్తులను తీసుకోవడాన్ని నిలిపివేస్తుందని తెలిపింది. అంతేకాదు, వార్షిక వేతన పెంపులు కూడా తాత్కాలికంగా రద్దవుతాయని సమాచారం. ఈ నిర్ణయాలన్నీ ఖర్చులు తగ్గించాలన్న వ్యూహంలో భాగంగా తీసుకున్నవేనని చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రాజెక్టులకు కేటాయించబడని ("bench" పై ఉన్న) ఉద్యోగులకు, 35 రోజుల్లోగా కొత్త ప్రాజెక్ట్ దొరకకపోతే కంపెనీ నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఈ కొత్త పాలసీ ఇప్పటికే హైదరాబాద్, పుణె, చెన్నై, కోల్‌కతా లాంటి నగరాల్లో అమల్లోకి వచ్చింది.
లేటరల్ హైర్ కేవలం పేరుకే
కొత్తగా అనుభవజ్ఞులైన లేటరల్ హైర్ ను తీసుకోవడంలో ఆలస్యం చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆన్‌బోర్డింగ్ ప్రక్రియకు 65 రోజులకు మించి సమయం పడుతోంది. అంటే, దీనివల్ల కొత్తగా ఉద్యోగాల్లోకి రావాలనుకున్నవారికి అవకాశాలు తగ్గిపోతున్నాయని చెప్పవచ్చు.
ఈ అన్ని చర్యలు ఒక్కటే లక్ష్యంతో ఉన్నాయి సంస్థ వ్యయాలు తగ్గించడం. కంపెనీ ఉద్యోగులకు పంపిన అంతర్గత ఈమెయిలు ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్, ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి కారణంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపింది.
ఒక ప్రముఖ ఐటీ విశ్లేషకుడి అంచనా ప్రకారం, ఈ మిడ్ మరియు సీనియర్ ఉద్యోగుల తొలగింపులు టీసీఎస్‌కి ప్రతి సంవత్సరం రూ 2,400 నుండి రూ 3,600 కోట్లు ఆదా చేసే అవకాశం ఉంది. ఇది కంపెనీకి 100-150 బేసిస్ పాయింట్ల మార్జిన్ మెరుగుదలనిస్తుందని పేర్కొన్నాడు.
Jefferies అనే బ్రోకరేజ్ సంస్థ ఈ చర్యను "canary in the coal mine" (ముందస్తుగా ప్రమాదాన్ని తెలియజేసే సూచన)గా అభివర్ణించింది. AI వల్ల పనిచేసే నైపుణ్యం పెరగడంతో పాటు ఖర్చు ఆధారిత ఒప్పందాలు కూడా కంపెనీలను తక్కువ ఉద్యోగులతో ఎక్కువ పని చేయాలనే దిశగా నెట్టేస్తున్నాయని అంచనా వేసింది.
జెఫరీస్ ప్రకారం, టీసీఎస్ తీసుకుంటున్న ఈ చర్యలు తాత్కాలికంగా డెలివరీ సమస్యలకు దారితీయొచ్చు. దీర్ఘకాలంలో ఉద్యోగుల అవస్థలు, ఎక్కువ మండి ఉద్యోగం మానేయడం (attrition) లాంటి అంశాలు పెరిగే అవకాశముందని సూచించింది.
స్టాక్ మార్కెట్ ప్రభావం
TCS షేర్లు గత సంవత్సరం నుంచి సుమారు 30% తగ్గిపోయాయి. ఇది Nifty IT ఇండెక్స్‌లో అత్యంత బలహీనంగా ప్రదర్శించిన కంపెనీలలో ఒకటిగా నిలిచింది. ఈ ఏడాది మొదటి నుంచే కంపెనీ షేర్లు 25% పడిపోయాయి. కేవలం గత నెలలోనే 12% తగ్గాయి.
ఈ పరిణామాలన్నీ టెక్ రంగంలో ఉద్యోగ భద్రత గురించి కొత్త ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. ఇప్పుడు సాధారణ కోడింగ్ జాబ్స్ కూడా సురక్షితంగా లేవన్నదే స్పష్టమవుతోంది. కంపెనీలు తక్కువ ఖర్చుతో అధిక ఫలితాలకోసం నూతన వ్యూహాలను చేపడుతున్నాయి. ఉద్యోగులు కూడా మారుతున్న అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సిన సమయం ఇదే.


Click it and Unblock the Notifications