Trending: ఆఫర్ 80 లక్షలు.. చేతికి వచ్చేది 40.. మిగతాది ఏమైందో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు!
సాధారణంగా ఐఐఎం (IIM) లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు కోట్లల్లో ప్యాకేజీలు రావడం మనం చూస్తుంటాం. రీసెంట్ గా ఒక ఆఫ్రికన్ కంపెనీ ఐఐఎం కలకత్తా విద్యార్థులకు రూ. 80 లక్షల భారీ వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసింది. వినడానికి ఇది ఎంతో గొప్పగా అనిపించినా దాని వెనుక ఉన్న అసలు ట్విస్ట్ తెలిస్తే మాత్రం ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ (Trending) లో ఉంది.

అసలు విషయం ఏంటంటే?
పాపులర్ పాడ్‌కాస్టర్ కుశాల్ లోధా.. ప్రముఖ ఎంట్రప్రెన్యూర్ అమన్ దత్తర్వాల్‌తో జరిపిన సంభాషణలో ఈ విషయాన్ని బయటపెట్టారు. ఐఐఎం కలకత్తా ప్లేస్‌మెంట్స్ సమయంలో ఒక ఆఫ్రికన్ కంపెనీ రూ. 80 లక్షల సీటీసీ (CTC) ఆఫర్ చేసింది. అయితే, ఆ 80 లక్షల్లో కేవలం 40 లక్షలు మాత్రమే ఫిక్స్‌డ్ శాలరీ అని, మిగిలిన 40 లక్షలు 'కిడ్నాపింగ్ ఇన్సూరెన్స్' (Kidnapping Insurance) కోసం కేటాయించారని ఆయన చెప్పారు. అంటే ఒకవేళ సదరు ఉద్యోగిని ఎవరైనా కిడ్నాప్ చేస్తే, ఆ డబ్బును విమోచన క్రయధనం (Ransom) కింద చెల్లించడానికి కంపెనీ ముందే పక్కన పెడుతుందన్నమాట!
సీటీసీ (CTC) వర్సెస్ ఇన్ హ్యాండ్ శాలరీ
చాలా కంపెనీలు తమ ప్యాకేజీని పేపర్ మీద చాలా ఎక్కువగా చూపిస్తాయి. దీన్నే 'సీటీసీ' లేదా కాస్ట్ టు కంపెనీ అంటారు. కానీ, చేతికి వచ్చే సరికి ఆ మొత్తం సగానికి తగ్గిపోతుంటుంది. ఈ కిడ్నాపింగ్ ఇన్సూరెన్స్ వ్యవహారంపై కుశాల్ లోధా స్పందిస్తూ.. "ఇదొక రకమైన స్కామ్ లాంటిదే. ఆ దేశాల్లో కిడ్నాప్‌లు చాలా కామన్ కాబట్టి కంపెనీలు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాయి. కానీ దాన్ని కూడా శాలరీ ప్యాకేజీలో కలపడమే విడ్డూరం" అని పేర్కొన్నారు.
నెటిజన్ల ఫన్నీ రియాక్షన్స్
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "అట్లీస్ట్ వాళ్ళ దేశంలో న్యాయవ్యవస్థ బాలేదని నిజాయితీగా ఒప్పుకున్నారు" అని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు "మరి కిడ్నాపర్లు 41 లక్షలు డిమాండ్ చేస్తే.. ఆ అదనపు లక్షను వచ్చే ఏడాది శాలరీలో క్లెయిమ్ చేసుకోవచ్చా?" అంటూ జోకులు పేలుస్తున్నారు. మరికొందరైతే "మన ఫ్రెండ్స్ తోనే కిడ్నాప్ చేయించుకుని, ఆ 40 లక్షలు కొట్టేయొచ్చు కదా" అంటూ ఫన్నీ సలహాలు ఇస్తున్నారు.
టోలారం గ్రూప్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది
ఈ వింత ఆఫర్ ఇచ్చిన కంపెనీ 'టోలారం గ్రూప్' (Tolaram Group) అయి ఉండొచ్చని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కేవలం ఐఐఎం మాత్రమే కాకుండా, కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ఈ కంపెనీ ఇలాంటి వింతైన ప్యాకేజీ స్ట్రక్చర్ ను ఫాలో అవుతుందని నెటిజన్లు చెబుతున్నారు. ఏది ఏమైనా, ఉద్యోగంలో చేరే ముందు కేవలం పెద్ద అంకెలను చూసి మోసపోకుండా, ఇన్ హ్యాండ్ శాలరీ ఎంతో తెలుసుకోవడం చాలా ముఖ్యం అని ఈ ఘటన మరోసారి నిరూపించింది.


Click it and Unblock the Notifications