Stock Market: ఇన్వెస్టర్లకు రూ.30 లక్షల కోట్లు లాస్.. సెబీపై సుప్రీంకోర్టులో పిటిన్..
Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు ఎన్నికల వేళ వివాదాస్పదంగా మారుతున్నాయి. మార్కెట్లలో పెద్ద స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తుండగా.. ప్రస్తుతం మ్యాటర్ ఏకంగా దేశంలోని అత్యున్నత ధర్మాసనానికి చేరుకుంది.
వివరాల్లోకి వెళితే.. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ రోజు స్టాక్ మార్కెట్ భారీగా పతనమై ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.30 లక్షల కోట్లు ఆవిరైంది. దీనికి సంబంధించి ప్రభుత్వం, స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టులో తాజా పిటిషన్ దాఖలైంది. స్టాక్ మార్కెట్ పతనంపై నివేదిక సమర్పించాల్సిందిగా ప్రభుత్వం, సెబీని ఆదేశించాలని ఈ పిటిషన్ సుప్రీం కోర్టుకు చేరటం పెద్ద చర్చకు దారితీసింది.

ఈ మేరకు న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విశాల్ తివారీ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజున, మార్కెట్ భారీ పతనాన్ని చవిచూసింది. మీడియా నివేదికలను ప్రకారం పెట్టుబడిదారులు భారీ నష్టాన్ని చవిచూశారని అన్నారు . ఈ సందర్భంగా ఆయన నియంత్రణ వ్యవస్థపై ప్రశ్నలు సంధించారు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత మార్కెట్ ఒక్కసారిగా పైకి ఎగబాకిందని, అయితే ఫలితాలు రాగానే మార్కెట్ కుప్పకూలిందని అన్నారు.
వాస్తవానికి జూన్ 4న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాగానే, ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పినట్లు అధికార పార్టీ బీజేపీకి సొంతంగా మెజారిటీ రాదనే ట్రెండ్ స్పష్టంగా కనిపించింది. దీంతో ఫలితాల రోజున బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 6300 పాయింట్లు, నిఫ్టీ 2000 పాయింట్లు పడిపోయాయి. ఆ రోజు ఇన్వెస్టర్లు రూ.30 లక్షల కోట్లు నష్టపోవటం చరిత్ర సృష్టించింది. కానీ కనిష్ట స్థాయిల నుంచి కోలుకున్న తర్వాత సెన్సెక్స్ సూచీ 4389 పాయింట్లు, నిఫ్టీ సూచీ 1379 పాయింట్లు నష్టపోవడంతో ఒక్క సెషన్‌లో ఇన్వెస్టర్లు రూ.30 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు. అయితే మార్కెట్‌లో భారీ పతనం తర్వాత పెద్ద స్కామ్ జరిగిందంటూ రాజకీయ ఆరోపణలు మొదలయ్యాయి.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం కూడా మార్కెట్ల పతనానికి ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్ కారణమని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంపై జేపీసీ విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications