AI కి మారండి..లేదంటే రాజీనామా చేసి వెళ్లిపోండి... ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అల్టిమేటం..
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన టీంకు ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా ఒక కఠినమైన సందేశాన్ని ఇచ్చినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ వెల్లడించింది. దీని కథనం ప్రకారం.. AI టెక్నాలజీకు పూర్తిగా అలవాటు పడండి... లేదంటే కొత్త ఉద్యోగం చూసుకోండి అనే స్పష్టమైన హెచ్చరికతో, మైక్రోసాఫ్ట్‌లో నాయకత్వానికి కొత్త నిర్వచనం మొదలైందని చెబుతోంది. 2025 చివర్లో పంపిన అంతర్గత మెమోలు, టౌన్ హాల్ సమావేశాల ద్వారా ఈ ఆదేశాన్ని నాదెళ్ల స్పష్టం చేసినట్లుగా కథనం వెలువరించింది.
ఇది ఆయన గత దశాబ్ద కాలంగా పాటిస్తున్న సానుభూతి ఆధారిత నాయకత్వ శైలికి ముగింపు పలికినట్టుగా భావిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ఇప్పుడు కేవలం ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీగా కాకుండా, ఇంటెలిజెన్స్ ఇంజిన్ గా మారుతున్న నేపథ్యంలో పాత ఆలోచనలు, నెమ్మదైన నిర్ణయాలు కంపెనీకి భారంగా మారాయని నాదెళ్ల భావిస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది.

AI విప్లవంలో వెనుకబడితే ఒకప్పుడు అగ్రస్థానంలో ఉన్న డిజిటల్ ఎక్విప్‌మెంట్ కార్పొరేషన్ (DEC)లా మైక్రోసాఫ్ట్ కూడా చరిత్రలో కలిసిపోయే ప్రమాదం ఉందని నాదెళ్ల తరచుగా ఉదాహరణగా చెబుతున్నారని సంస్థలోని ఉద్యోగులు తెలిపారు. కొత్త సాంకేతికతలకు అనుగుణంగా మారడంలో విఫలమైతే ఎంత పెద్ద సంస్థ అయినా కూలిపోతుందని DEC ఉదాహరణ ద్వారా ఆయన హెచ్చరిస్తున్నారు.
ఈ లక్ష్యాన్ని సాధించేందుకు మైక్రోసాఫ్ట్‌లో విస్తృత స్థాయి సంస్థాగత మార్పులు ప్రారంభమయ్యాయి. ఉన్నత స్థాయి కార్యనిర్వాహక మార్పులు, పెద్ద జట్లను చిన్నగా మార్చడం, వేగంగా నిర్ణయాలు తీసుకునే నిర్మాణం ఏర్పాటు చేయడం, AI చుట్టూ అధికారాన్ని కేంద్రీకరించడం వంటి చర్యలు ఇందులో భాగంగా ఉన్నాయి. కంపెనీ ఉత్పత్తులను ఎలా డిజైన్ చేయాలి, ఎలా నిధులు కేటాయించాలి అనే అంశాల్లో కూడా AIనే కేంద్రంగా పెట్టి పూర్తిస్థాయి మార్పు చేయాలన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది.
సత్య నాదెళ్ల ఇప్పుడు చాలా తీవ్రమైన ఆవశ్యకతతో ముందుకు వెళ్తున్నారని ఒక సీనియర్ మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ బిజినెస్ ఇన్‌సైడర్‌కు తెలిపారు. AI విప్లవాన్ని పూర్తి చేయడానికి అవసరమైన శ్రమకు తాము ఎంతకాలం కట్టుబడి ఉండగలమో అనుభవజ్ఞులైన కొందరు నాయకులు తమను తాము ప్రశ్నించుకునే స్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.AI పనిని మరింత వేగవంతం చేయడానికి నాదెళ్ల వారపు AI యాక్సిలరేటర్ సమావేశాన్ని కూడా ప్రారంభించారు. దీనితో పాటు ప్రత్యేకమైన టీమ్స్ ఛానల్ ద్వారా ఉద్యోగుల నుంచి ఆలోచనలు, వినూత్న ప్రతిపాదనలు సేకరిస్తున్నారు. AI ప్రతి విభాగంలోనూ ప్రవేశించాలన్నదే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
ఇటీవలి పరిణామాల్లో భాగంగా.. ఆఫీస్, విండోస్ విభాగాలను పర్యవేక్షిస్తున్న రాజేష్ ఝా, అలాగే మైక్రోసాఫ్ట్ సైబర్ భద్రతా కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్న చార్లీ బెల్ పదవీ విరమణ చేసే అవకాశాలు ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇవన్నీ కంపెనీని AI ఆధారిత భవిష్యత్తుకు సిద్ధం చేసే పునర్వ్యవస్థీకరణలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications