Adani Cement: దేశంలోని వృద్ధి రేటును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2023లో అత్యధికంగా నిర్మాణ రంగంపై ఖర్చుచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అదానీ గ్రూప్ సైతం ఆ రంగంలో అవకాశాలను సొమ్ము చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే గౌతమ్ అదానీ యాజమాన్యంలోని అదానీ గ్రూప్ అనేక సిమెంట్ కంపెనీలను వ్యూహాత్మకంగా కొనుగోలు చేసింది. ఏసీసీ సిమెంట్స్, అంబుజా సిమెంట్స్, సంఘీ సిమెంట్స్ తర్వాత ఏషియన్ కాంక్రీట్స్ అండ్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్(ACCCPL)పై కంపెనీ కన్ను పడింది. అదానీ సిమెంట్స్ తన ఉత్పాదకతను పెంచుకోవటంతో భారత నిర్మాణ రంగంలో భాగస్వామిగా మారాలని చూస్తోంది. కంపెనీలో 55 శాతం అదనపు వాటాను విజయవంతంగా కొనుగోలు చేసినట్లు అదానీకి చెందిన సిమెంట్ కంపెనీ ఏసీసీ లిమిటెడ్ ప్రకటించింది. దీంతో కంపెనీలో పూర్తి యాజమాన్యం ప్రస్తుతం అదానీ గ్రూప్ చేతికి చిక్కింది.

ఏసీసీ లిమిటెడ్ ఏషియన్ కాంక్రీట్స్ అండ్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో వాటాలను రూ.775 కోట్లతో కొనుగోలు చేసింది. ఎంటర్‌ప్రైజ్ విలువలో రూ.35 కోట్ల నగదు, నగదు సమానమైనవి ఉన్నాయి. ACC లిమిటెడ్ ఇప్పటికే ఆసియా కాంక్రీట్స్ అండ్ సిమెంట్స్‌లో 45% వాటాను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. ఈ డీల్ ACC, దాని మాతృ సంస్థ అంబుజా సిమెంట్స్ ఉత్తర భారతదేశంలోని లాభదాయకమైన సిమెంట్ మార్కెట్‌లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి సహాయపడనుంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని నలగర్‌లో ఏషియన్ కాంక్రీట్స్ అండ్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1.3 MTPA సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే దాని అనుబంధ సంస్థ ఏషియన్ ఫైన్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్(AFCPL) పంజాబ్‌లోని రాజ్‌పురాలో 1.5 MTPA సిమెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ వ్యూహాత్మక ఒప్పందంతో సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 38.55 MTPAలకు చేరుకుంది. మాతృ సంస్థ అంబుజాతో దాని సిమెంట్ సామర్థ్యం ఇప్పుడు 76.10 MPTAకి చేరుకుంది. గడచిన ఆరునెలల కాలంలో ఏసీసీ సిమెంట్స్ స్టాక్ 33 శాతం మేర పెరిగింది. ఈ కాలంలో స్టాక్ ధర రూ.1796.75 నుంచి రూ.2400.80కి చేరుకుంది.


Click it and Unblock the Notifications