Adani Wilmar Q1 Results: ఈరోజు అదానీ గ్రూప్ ఎఫ్ఎంసీజీ కంపెనీ అయిన అదానీ విల్మార్ తన క్యూ1 ఫలితాలను ప్రకటించింది. దీంతో కంపెనీ కార్పొరేట్ ఫలితాలు ఇన్వెస్టర్లలో కొత్త జోష్ నింపాయి.
ఎఫ్ఎంసీజీ రంగంలో వ్యాపారం నిర్వహిస్తున్న అదానీ విల్మార్ తన ఫలితాలతో అందరినీ అబ్బురపరిచింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఏకంగా రూ.323 కోట్ల భారీ లాభాన్ని నమోదు చేసింది. అయితే గత ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ.38.44 కోట్ల నష్టాన్ని నివేదించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి అదానీ గ్రూప్ ఈ వ్యాపారాన్ని జాయింట్ వెంచర్ రూపంలో నిర్వహిస్తోంది. ఇది అదానీ ఎంటర్ ప్రైజెస్, విల్మార్ ఇంటర్నేషనల్ మధ్య కొనసాగుతున్న జాయింట్ వ్యాపారం.

దేశంలో అదానీ గ్రూప్ కంపెనీ వంటనూనె విక్రయాలను అదానీ విల్మార్ పేరు కింద నిర్వహిస్తోంది. ఈ బ్రాండ్ కింద సన్‌ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ నూనె, ఆవాల నూనెను మార్కెట్లో విక్రయిస్తోంది. ప్రస్తుతం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.13,750.04 కోట్లుగా నిలిచింది. ఇది గత ఏడాది ఇదే సమయంలో రూ.12,378.83 కోట్లుగా ఉన్నాయి. కంపెనీ ఎడిబుల్ ఆయిల్ ధరల్లో స్థిరత్వం కారణంగా EBITDA అత్యధికంగా ఏడాదికి 375 శాతం పెరిగి రూ.619 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం కంపెనీ Fortune, Aadhaar సహా మరిన్ని బ్రాండ్ పేర్ల కింద విక్రయాలు నిర్వహిస్తోంది.
ఇక అమ్మకాల విషయానికి వస్తే అదానీ విల్మార్ వంటనూనెల విక్రయం ఏడాది ప్రాతిపదికన 12 శాతం బలమైన వాల్యూమ్ వృద్ధిని నమోదు చేసింది. జూన్ త్రైమాసికంలో 1 మిలియన్ మెట్రిక్ టన్నుల వంటనూనె విక్రయాలను అధిగమించింది. ఆహార & FMCG విక్రయాలు రూ.1,500 కోట్లను దాటాయి. కంపెనీ సానుకూల ఆర్థిక ఫలితాలను ప్రకటించటంతో నేడు మధ్యాహ్నం 1.05 గంటల సమయంలో అదానీ విల్మార్ కంపెనీ షేర్ల ధర ఎన్ఎస్ఈలో 5.95 శాతం పెరిగి రూ.344.45 వద్ద కొనసాగుతోంది. ఇదే క్రమంలో అదానీకి చెందిన అదానీ టోటర్ గ్యాస్, ఏసీసీ సిమెంట్స్, షేర్లు సైతం ఫలితాలకు ముందు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.


Click it and Unblock the Notifications