adani: బాండ్స్ బైబ్యాక్ కు అదానీ ట్రాన్స్ మిషన్ ప్లానింగ్.. డీల్ వాల్యూ ఎంతంటే..
adani: హిండెన్ బర్గ్ ఆరోపణల అనంతరం పలు ఇబ్బందులు ఎదుర్కొన్న అదానీ గ్రూపు.. నష్ట నివారణ చర్యలకు దిగిన విషయం తెలిసిందే. వినియోగదారుల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు ఇప్పటికే వివిధ రుణాలను మెచ్యూరిటీకి ముందే చెల్లించడం, కుదువ పెట్టిన షేర్లను విడిపించుకోవడ వంటివి చేస్తోంది. ఇందులో భాగంగా మరో పని చేయడానికి రంగం సిద్ధం చేసింది.
ఓ యూనిట్ జారీచేసిన 100 మిలియన్ డాలర్ల బాండ్లను తిరిగి కొనుగోలు చేసేందుకు అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ యత్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పెట్టుబడిదారుల్లో ధైర్యం నింపేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అనుబంధ సంస్థ అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్ ద్వారా త్వరలో బాండ్ బైబ్యాక్ ను ప్రకటిస్తుందని సమాచారం.

ఈ డీల్ సాఫీగా పూర్తయ్యేందుకు కొన్ని బ్యాంకులు అదానీ ట్రాన్స్‌మిషన్ తో కలిసి పనిచేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ వార్తలపై అదానీ గ్రూపు ప్రతినిధి స్పందించలేదు. కాగా డిసెంబర్ 2022 నాటికి 35 బిలియన్ రూపాయల నగదు అదానీ ట్రాన్స్‌మిషన్ వద్ద ఉంది. ఇప్పటికే ప్లాన్ చేసిన లావాదేవీలు పూర్తి చేయడానికి ఈ నిధులు సరిపోతాయని గత ఫిబ్రవరి కాన్ఫరెన్స్ కాల్ లో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ సర్దానా వెల్లడించడం గమనార్హం.
కేవలం అదానీ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్ మాత్రమే కాక అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ సైతం ఇదే బాటలో ముందుకు సాగడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకు అనుగుణంగా తన జూలై 2024 బాండ్‌లలో 130 మిలియన్ డాలర్ల బైబ్యాక్ తో పాటు మరియు తదుపరి 4 త్రైమాసికాల్లోనూ ఈ తరహా కొనుగోళ్లు జరపాలని యోచిస్తున్నట్లు గత నెలలో కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications