adani: నెలరోజుల్లో అదానీ గ్రూపు నష్టం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే !
adani: భారతీయ స్టాక్ మార్కెట్ కు ఎంతో ఘన చరిత్ర ఉంది. ఎన్నో కుంభకోణాలు, సంక్షోభాలను ఎదుర్కొని నిలిచింది. గతనెల ఇదే రోజు వెలుగులోకి వచ్చిన ఓ ఉదంతం మార్కెట్లను తీవ్ర నష్టాల్లోకి తీసుకువెళ్తోంది. అంతేగాక అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తోంది. అమెరికా రీసెర్చి సంస్థ హిండెన్ బర్గ్.. అదానీ గ్రూపు కంపెనీల్లో స్టాక్ మ్యానిప్లేషన్ జరుగుతోందంటూ చేసిన ఆరోపణల ఫలితమే ఇదంతా. ఇది జరిగి నెలరోజులు గడుస్తున్నా ఈ వ్యవహారం ఇంకా సెగలు పుట్టిస్తూనే ఉంది.

రిలయన్స్, టాటా గ్రూపును మించి:
జనవరి 24, 2023న అదానీ గ్రూపు కంపెనీలపై అమెరికా సంస్థ హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. ఇది జరిగి నేటికి నెల కాగా.. ఇప్పటి వరకు ఆ కంపెనీలు రూ.12 లక్షల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. హిండెన్ బర్గ్ నివేదిక వెలువడే నాటికి గ్రూపు కంపెనీల మొత్తం విలువ రూ.19 లక్షల కోట్లుగా ఉంది. రిలయన్స్, టాటా గ్రూపు సంస్థల కంటే అధిక మార్కెట్ క్యాప్ తో అదానీ సంస్థలు అప్పటివరకు దూసుకువెళ్లాయి.

ఇంటా, బయటా రచ్చ:
హిండెన్ బర్గ్ విడుదల చేసిన నివేదిక ఒక్కసారిగా అదానీ గ్రూపును షేక్ చేసింది. ఊహించని ఘటనతో డీప్ ఫాల్ మొదలై ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నెల రోజులు గడిచినా నష్టాలకు బ్రేకులు పడటం లేదు. దానికి తోడు ప్రజలతో పాటు పార్లమెంటులో విపక్షాలు సైతం దుమ్మెత్తి పోస్తున్నాయి. జార్జి సోరోస్ వంటి విదేశీ పెట్టుబడిదారులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అంతర్జాతీయ విపణిలో భారత మార్కెట్ల స్థాయి పడిపోతోంది.

71 శాతం భారీ క్షీణత:
గడిచిన నెలలో భారీ నష్టాలను అదానీ గ్రూపు చవిచూసింది. వివిధ కంపెనీలు సంవత్సర కనిష్ఠ స్థాయిని తాకాయి. మెజారిటీ సంస్థలు బ్యాక్-టు-బ్యాక్ లోయర్ సర్క్యూట్ లను టచ్ చేస్తున్నాయి. ఇవాళ మార్కెట్ ముగిసే సమయానికి BSEలో మొత్తం గ్రూపు మార్కెట్ క్యాప్ రూ.7 లక్షల కోట్లకు పడిపోయింది. గరిష్ఠ స్థాయి రూ.25 లక్షల కోట్లతో పోలిస్తే 71 శాతం అంటే రూ.17.8 లక్షల కోట్ల భారీ నష్టాన్ని చవిచూసినట్లు స్టాక్ బాక్స్ హెడ్ టెక్నికల్ ఎనలిస్ట్ రోహన్ షా తెలిపారు.


Click it and Unblock the Notifications