Q4 Results: వరుసగా రెండో శుభవార్త.. అదరగొట్టిన అదానీ పోర్ట్స్ లాభాలు..
Adani Ports: దేశంలోని పోర్ట్స్ వ్యాపారంలో అదానీ గ్రూప్ కంపెనీ అదానీ పోర్ట్స్ అగ్రగామి సంస్థగా కొనసాగుతోంది. కొన్ని రోజుల కిందట కంపెనీ దేశంలో AAA క్రెడిట్ రేటింగ్ అందుకున్న తొలి ప్రైవేట్ పోర్ట్ ఆపరేటర్‌గా రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత నేడు కంపెనీ తన క్యూ4 ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ కన్సాలిడేటెడ్ నికర లాభం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఏకంగా 76 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో కంపెనీ క్యూ4 నికర లాభం రూ.2,040 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం కేవలం రూ.1,158 కోట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే వ్యాపారం ద్వారా ఆదాయం గత ఏడాది కంటే 19 శాతం పెరిగి రూ.6,896.50 కోట్లకు చేరుకుంది. దీంతో కంపెనీ బోర్డు అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై రూ.6 డివిడెండ్ ఇన్వాలని నిర్ణయించింది. దీనికోసం కంపెనీ ఏజీఎంలో షేర్ హోల్డర్ల నుంచి ఆమోదం పొందాలని చూస్తోంది.

ఈరోజు మార్కెట్లు ముగిసే సమయానికి ఎన్ఎస్ఈలో అదానీ పోర్ట్స్ స్టాక్ స్వల్పంగా 1.25 శాతం లాభపడి రూ.1,341.50 రేటు వద్ద క్లోజ్ అయ్యింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.2.89 లక్షల కోట్లకు చేరుకుంది. వార్షిక ప్రాతిపదికన కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం మెుత్తం FY23లో రూ.20,851 కోట్ల నుంచి FY24లో 28.09% వృద్ధితో రూ.26,710 కోట్లకు చేరుకుంది. అలాగే మెుత్తం ఆర్థిక సంవత్సరానికి నికర లాభం FY23లో రూ.5,308.85 కోట్ల నుంచి 53% పెరిగి రూ.8,110.64 కోట్లకు చేరుకుంది.
తాజాగా అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ రేటింగ్ సంస్థ కేర్ నుంచి AAA రేటింగ్ పొందిన మెుట్టమెుదటి ప్రైవేటు పోర్టు ఆపరేటర్‌గా రికార్డు సృష్టించింది. గతంలో ఉన్న రేటింగ్ అప్ గ్రేడ్ చేయటంతో కంపెనీ విలువ అమాంతం పెరిగింది. రేపు మార్కెట్ల ఓపెనింగ్ తర్వాత ఇన్వెస్టర్లు అదానీ పోర్ట్స్ షేర్లపై పెద్ద బెట్టింగ్ వేసే దిశగా ఇది ప్రేరేపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఇది భారతదేశంలో ఏదైనా కంపెనీకి అందించగలిగిన అత్యధిక క్రెడిట్ రేటింగ్. ఇది కంపెనీ బలమైన క్రెడిట్ యోగ్యతతో పాటు పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించగలిన సామర్థ్యాన్ని సూచిస్తుంది.


Click it and Unblock the Notifications