Israel Hamas war: ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న పోరాటం ప్రపంచాన్ని ఒక్కసారిగా కలవరానికి గురిచేసింది. ఈ క్రమంలో భారత్ సైతం తమ మద్ధతును ఇజ్రాయెల్ కు ప్రకటించింది. దీనిపై భారత ప్రధాని మోదీతో పాటు అనేక ప్రపంచ దేశ నాయకులు స్పందించారు.
శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై అనూహ్యమైన దాడిలో గాజా స్ట్రిప్‌లో హమాస్ వేలాది రాకెట్లను ప్రయోగించింది. దీనితో పాటు వందలాది మంది హమాస్ యోధులు వాయు, భూమి, సముద్రం ద్వారా ఇజ్రాయెల్ సరిహద్దులోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ కూడా యుద్ధం ప్రకటించింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అక్కడ నివసిస్తున్న మన పౌరులకు భద్రతా సలహాను జారీ చేసింది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా తన విమాన సేవలను రద్దు చేసింది. అయితే ఈ యుద్ధం గౌతమ్ అదానీని ఎలా ప్రభావితం చేయనుందో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి ఇది అదానీకి ఈ ఏడాది మరో పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి.

అదానీ గ్రూప్ ఇజ్రాయెల్ హైఫా పోర్టును కొనుగోలు చేసింది. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, ఇజ్రాయెల్ గాడోట్ గ్రూప్ గత ఏడాది జూలైలో దీని ప్రైవేటీకరణ కోసం 1.18 బిలియన్ డాలర్లతో బిడ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భారతీయ భాగస్వామి అదానీకి 70 శాతం, గాడోట్ గ్రూప్‌కు 30 శాతం వాటా ఉంది. షిప్పింగ్ కంటైనర్ల పరంగా హైఫా పోర్ట్ ఇజ్రాయెల్లో రెండవ అతిపెద్ద ఓడరేవు, అలాగే పర్యాటక క్రూయిజ్ షిప్‌ల పరంగా అతిపెద్ద ఓడరేవుగా ఉంది. యుద్ధం కొనసాగుతున్న వేళ ఇది అదానీ గ్రూప్‌కు పెద్ద నష్టాన్ని తెచ్చిపెట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారత్-ఇజ్రాయెల్ మధ్య వాణిజ్యం కరోనాకి ముందు 5 బిలియన్ డాలర్ల నుంచి ప్రస్తుతం 7.5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ద్వైపాక్షిక వాణిజ్యంలో వజ్రాల వ్యాపారం దాదాపు 50 శాతం వాటాను కలిగి ఉంది. అలాగే భారతదేశం కూడా ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటోంది. ఇండియన్ ఎంబసీ వివరాల ప్రకారం ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో దాదాపు 18,000 మంది భారతీయ పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. 1950-60లలో భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు 85,000 మంది భారతీయ సంతతికి చెందిన యూదులు వలస వెళ్లారు. ఈ క్రమంలోనే హమాస్ దాడిని ఖండించిన ప్రధాని మోదీ.. ఇజ్రాయెల్‌లో ఉగ్రదాడుల వార్త చూసి దిగ్భ్రాంతికి గురైనట్లు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications