అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణల కారణంగా అదానీ గ్రూపు పెద్ద కుదుపునకు గురైందన్న విషయం తెలిసిందే. వివిధ అంతర్జాతీయ సంస్థలు సైతం ఆ కంపెనీలకు రేటింగ్స్ తగ్గించడం, బాండ్ల విలువను జీరో చెయ్యడం జరిగింది. అదానీ సంస్థల చేతిలో ఉన్న పలు ప్రాజెక్టులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో.. తాజ్ పూర్ ప్రాజెక్టుకు ఎటువంటి ఇబ్బందీ లేదని అదానీ పోర్ట్స్ కు చెందిన ఓ ఉన్నతోద్యోగి వెల్లడించినట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.

ఫార్మాలిటీల కోసం వెయిటింగ్:
పశ్చిమ బెంగాల్ లోని తాజ్ పూర్ లో రూ.15 వేల కోట్ల డీప్-సీ పోర్ట్ ప్రాజెక్టుకు అదాని పోర్ట్స్ & సెజ్ లిమిటెడ్ (APSEZ) కట్టుబడి ఉన్నట్లు ఆ సంస్థ సిబ్బంది ఒకరు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి కావాల్సిన చట్టబద్ధమైన ఒప్పందం కోసం వేచి ఉన్నట్లు చెప్పారు. అధికారిక ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత, ముందస్తు ప్రణాళిక ప్రకారం నిర్ణయించిన సమయానికి పోర్టును అభివృద్ధి చేసి అందచేస్తామన్నారు.

స్పందన కరవు:
పోర్ట్ కి కనెక్టివిటీ, అనుబంధ మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.25 వేల కోట్లు వెచ్చించనున్నట్లు సమాచారం. అయితే ఈ పనులు ప్రారంభించే ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ మరియు డ్రాఫ్ట్ కన్సెషన్ అగ్రిమెంట్ పొందాలని అదానీ సంస్థ ఉన్నతోద్యోగి వెల్లడించారు. అవి రాగానే పని మొదలవుతుందన్నారు. అయితే బెంగాల్ ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తోందని, అధికారులు అడుగడుగునా తమకు మార్గనిర్దేశం చేస్తున్నారని వెల్లడించారు. కానీ ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు.

ఇదీ జరిగింది:
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అవసరమైన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఈ పోర్టు ఒకటి. అందుకే బెంగాల్ ప్రభుత్వం 2022లో నిర్వహించిన దుర్గా పూజ అనంతరం ఓ నిర్ణయం తీసుకుంది. సీఎం మమతా బెనర్జీ, పరిశ్రమల శాఖ మంత్రి శశి సమక్షంలో APSEZ సీఈవో కరణ్ అదానీకి.. ఓడరేవు అభివృద్ధికి సంబంధించిన లెటర్ ఆఫ్ అవార్డును ప్రభుత్వం అందజేసింది. తాజ్ పూర్‌లో డీప్ సీ పోర్ట్ ను అభివృద్ధి చేయడం కోసం.. గతేడాది అక్టోబరులో తాజ్ పూర్ సాగర్ పోర్ట్ పేరుతో ఓ అనుబంధ సంస్థను సైతం అదానీ గ్రూపు ఏర్పాటు చేసింది.

ఆర్థికాభివృద్ధికి కీలకం:
తాజ్ పూర్ ఓడరేవు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఉపయోగపడే ప్రధాన ప్రాజెక్టు అని.. ఈ విషయంలో అదానీ గ్రూపు ముందుకు సాగుతుందని ఎంసీసీ అధ్యక్షులు నమిత్ బజోరియా ఇటీవల తెలిపారు. కోల్ కతా నుంచి 200 కి.మీ దూరంలో ఈ నౌకాశ్రయం ఉంది. ఇది 12.1 మీటర్ల లోతైన డ్రాఫ్ట్, 18 కిలోమీటర్ల ఛానల్ పొడవును కలిగి ఉంటుంది. డ్రై టన్నేజ్ (DWT) కార్గో నౌకల్లో అతిపెద్ద క్యాప్ సైజ్ షిప్ లు సైతం ఇక్కడ కార్యకలాపాలు సాగించవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 25 వేలు, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉద్యోగ అవకాశాలాలు లభిస్తాయని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications