వారెన్ బఫెట్‌ను దాటేసిన గౌతమ్ అదానీ, ప్రపంచ 5 కుబేరుడు
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ మరో ఘనత సాధించారు. ఫోర్బ్స్ డేటా ప్రకారం ఆయన (గౌతమ్ అదానీ) ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌ను దాటేసి, ఐదో స్థానానికి ఎగబాకారు. 59సంవత్సరాల అదానీ నికర సంపద 123.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. వారెన్ బఫెట్ సంపద 121.7 బిలియన్ డాలర్లుగా ఉంది. గౌతమ్ అదానీ గతంలోనే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని దాటేసి, ఆసియా కుబేరుడిగా నిలిచారు. పదో స్థానానికి ఎగబాకారు. ఇప్పుడు ఏకంగా బఫెట్‌ను దాటేసి, ఐదో స్థానానికి చేరుకున్నారు.

కంపెనీలు అదుర్స్
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ సంపద వ్యాల్యూ తాజాగా మరింత పెరగడంతో ఆయన ఐదో స్థానానికి ఎగబాకారు. అదానీ గ్రూప్‌లో ఏడు లిస్టెడ్ సంస్థలు అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్సుమిషన్, అదానీ విల్మర్ ఉన్నాయి. ఇవి ఇటీవలి కాలంలో భారీగా ఎగిశాయి. ఈ ఆరు సంస్థల మార్కెట్ క్యాప్ రూ.1 లక్ష కోట్లకు పైగా ఉంది. అదానీ నికర సంపద వ్యాల్యూ పెరగడంతో ఈ సంస్థలు కీలక పాత్ర పోషించాయి.

నలుగురే ముందు
ప్రపంచ కుబేరుల్లో అదానీ కంటే ముందు కేవలం నలుగురు ఉన్నారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ 130.2 బిలియన్ డాలర్లు, బెర్నార్డ్ అర్నాల్ట్ 167.9 బిలియన్ డాలర్లు, జెఫ్ బెజోస్ 170.2 బిలియన్ డాలర్లు, ఎలాన్ మస్క్ 269.7 బిలియన్ డాలర్లతో అదానీ కంటే ముందు ఉన్నారు.

అదానీ అదరగొట్టింది
అదానీ సంపద వ్యాల్యూ రెండేళ్ల క్రితం 8.9 బిలియన్ డాలర్లు. 2021 మార్చిలో ఈ మొత్తం 50.5 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లింది. 2022 మార్చి నాటికి దాదాపు రెట్టింపు 90 బిలియన్ డాలర్లను మించింది. ఆ తర్వాత అదానీ స్టాక్స్ వ్యాల్యూ మరింత పెరిగింది. కరోనా సమయంలో అదానీ సంపద వ్యాల్యూ గణనీయంగా పెరగడం ప్రారంభమైంది. ముంబై విమానాశ్రయంలో 74 శాతా వాటా, సాఫ్టు బ్యాంకు పునరుత్పాదక ఇంధన విభాగాన్ని 3.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం కలిసి వచ్చాయి. పలు పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో యూఏఈ యువరాజు సోదరుడు నిర్వహించే అబుదాబి ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది.
అదాని గ్రూప్ ఎనర్జీ రూ.4.41 లక్షల కోట్లు, అదానీ ట్రాన్సుమిషన్ రూ.2.87 లక్షల కోట్లు, అదానీ టోటల్ గ్యాస్ రూ.2.66 లక్షల కోట్లు, అదానీ ఎంటర్ ప్రైజెస్ రూ.2.51 లక్షల కోట్లు, అదానీ పోర్ట్స్ రూ.1.82 లక్షల కోట్లు, అదానీ పవర్ రూ.1.05 లక్షల కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications