Ambuja Cements: గౌతమ్ అదానీ సంస్థ తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు మరో భారీ పెట్టుబడిని ప్రకటించింది. దేశంలో నిర్మాణ రంగంలో కీలక భూమిక పోషించే దిశగా అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయత్నంలో ఇది భాగంగా ఉండనుంది.
అదానీకి చెందిన అంబుజా సిమెంట్స్ రూ.6,000 కోట్లతో రెన్యూవబుల్ గ్రీన్ ఎనర్జీ ఉత్పాదన కోసం వెచ్చించనుంది. 1000 మెగావాట్ల సామర్థ్యాన్ని సృష్టించటం ఇందులో లక్ష్యంగా ఉంది. అంబుజా సిమెంట్ ఈ పెట్టుబడిలో గుజరాత్, రాజస్థాన్‌లలో వ్యూహాత్మకంగా ఉన్న సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు ఉన్నాయి. గుజరాత్‌లో 600 మెగావాట్ల సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్, 150 మెగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్టు, రాజస్థాన్‌లో 250 మెగావాట్ల సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టాలని కంపెనీ నిర్ణయించింది.

2026 ఆర్థిక సంవత్సరం నాటికి దీన్ని సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంతో పాటు విద్యుత్తు ఖర్చును కూడా తగ్గిస్తుందని కంపెనీ తెలిపింది. విద్యుత్ ధర kWhకి రూ.6.46 నుంచి రూ.5.16కి తగ్గుతుంది. అంటే kWhకి రూ.1.30 తగ్గింపు (20%). కేవలం లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా గడువును అధిగమించే దిశగా పయనిస్తున్నామని సిమెంట్ బిజినెస్ సీఈవో అజయ్ కపూర్ అన్నారు. ఇది గ్రీన్ సిమెంట్ సరఫరాను పెంచడంలో కూడా సహాయపడుతుందని కంపెనీ భావిస్తోంది.
అదానీ గ్రూప్ ఒక దశాబ్దంలో గ్రీన్ ఎనర్జీలో 100 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గతవారం పెద్ద ప్రకటన చేసింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్ 2025 లేదా అంతకు ముందు నికర సున్నా కార్బన్ ఉద్గారాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని కంపెనీ తెలిపింది. ఈ క్రమంలోనే తొలుత తన సిమెంట్ వ్యాపారంపై అదానీ గ్రూప్ ఫోకస్ పెట్టింది. అలాగే అంబుజా సిమెంట్ తన వేస్ట్ హీట్ రికవరీ సిస్టమ్ సామర్థ్యాన్ని ఐదేళ్ల కాలంలో ప్రస్తుత 103 మెగావాట్ల నుంచి 397 మెగావాట్లకు పెంచడం గమనార్హం.


Click it and Unblock the Notifications