Adani News: దాదాపు 6 నెలల తర్వాత బిలియనీర్, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కొంత నెమ్మదిగా ముందుకు సాగారు. అయితే ఆయన మళ్లీ తిరిగి ట్రాక్ లోకి వచ్చినట్లు కనిపిస్తోంది.
దేశంలో ప్రస్తుతం నిర్మాణ రంగం గతంలో ఎన్నడూ చూడని వేగంతో వృద్ధి చెందుతోంది. దీంతో ఇన్ ఫ్రా రంగంలో అదానీ వేగంగా ముందుకు సాగేందుకు సిమెంట్ రంగంపై దూకుడుగా వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఏసీసీ సిమెంట్స్, అంబుజా సిమెంట్స్ కంపెనీలను కొనుగోలుచేశారు. తాజాగా ఈ రంగంలోని మరో ప్రత్యర్థి కంపెనీ అయిన సంఘీ సిమెంట్స్ దక్కించుకున్నారు.

ఏసీసీ సిమెంట్స్ తర్వాత అదానీ సిమెంట్ రంగంలో చేసిన రెండవ అతిపెద్ద డీల్ సంఘీ సిమెంట్స్ కొనుగోలు. అదానీ గ్రూప్ కంపెనీ అంబుజా సిమెంట్స్ రూ.5,000 కోట్లు వెచ్చించి ఎంటర్‌ప్రైజ్ విలువతో సంఘీ ఇండస్ట్రీస్‌ను కొనుగోలు చేసింది. ఈ ప్రకటన వెలువడటంతో సంఘీ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు లాభపడ్డాయి. అంబుజా సిమెంట్స్ తన మార్కెట్ ఉనికిని, సిమెంట్ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ సంఘీ ఇండస్ట్రీస్ కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది.

సంఘీ ఇండస్ట్రీస్ ప్రస్తుత ప్రమోటర్లైన రవి సంఘీ అండ్ ఫ్యామిలీ నుంచి అదానీ గ్రూప్ కంపెనీ అయిన అంబుజా సిమెంట్స్ రూ.5,000 కోట్లు వెచ్చించి 56.74 శాతం వాటాను సొంతం చేసుకుంది. ఈ వార్త నేపథ్యంలో అంబుజా సిమెంట్స్ కంపెనీ షేర్లు మార్కెట్లో 3.89 శాతం లాభపడి రూ.478.85 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. సంఘీ ఇండస్ట్రీస్ షేర్లు 5 శాతం మేర లాభపడి తన కొత్త 52 వారాల గరిష్ఠమైన రూ.105.40 వద్దకు చేరుకుంది.
సంఘీ సిమెంట్స్ కంపెనీని కొనుగోలు చేయటం ద్వారా అంబుజా సిమెంట్స్ వేగవంతమైన వృద్ధి ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. తాజా కొనుగోలుతో అదానీ గ్రూప్ 2028 నాటికి 140 MTPA సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని వెల్లడించారు. గుజరాత్ కచ్ జిల్లాలో సంఘీపురంలో SIL సమీకృత తయారీ యూనిట్ దేశంలోనే అతిపెద్ద సింగిల్-లొకేషన్ సిమెంట్ అండ్ క్లింకర్ యూనిట్ సామర్థ్యంతో ఉంది.


Click it and Unblock the Notifications