Adani News: పాపం.. కంపెనీని అమ్మేసుకుంటున్న అదానీ.. పూర్తి వివరాలు..
Adani News: దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే అదానీ గ్రూప్ అనేక వ్యాపారాల్లోకి వేగంగా అడుగుపెట్టింది. ఇందుగలను అందులేను అన్నట్లుగా గౌతమ్ అదానీ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. కానీ ఇప్పుడు..
తాజాగా అదానీ గ్రూప్‌కు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(NBFC) అదానీ క్యాపిటల్‌ను విక్రయించే ఒప్పందం చివరి దశలో ఉంది. మరో పక్క అంబానీ జియో ఫైనాన్సియల్స్ పేరుతో అడుగుపెడుతుండగా.. అదానీ ఈ వ్యాపారం నుంచి పక్కకు తప్పుకుంటున్నారు. అదానీ తన ఫైనాన్స్ వ్యాపారాన్ని ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బైన్ క్యాపిటల్ గ్రూప్ కు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విక్రయంలో అదానీ క్యాపిటల్ తన 90 శాతం వాటాను రూ.1,440 కోట్లకు విక్రయించాలని చూస్తోంది. త్వరలోనే ఈ డీల్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈ అదానీ గ్రూప్ కంపెనీలో వాటాను కొనుగోలు చేసిన తర్వాత బెయిన్ క్యాపిటల్ అదనంగా రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టనుందని నివేదికల ద్వారా వెల్లడైంది. అదే సమయంలో కంపెనీ విలువ రూ.1,600 కోట్లుగా అంచనా వేశారు. అదానీ క్యాపిటల్ సీఈవో గౌరవ్ గుప్తా కంపెనీలో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తారని వెల్లడైంది.
హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత ఇన్వెస్టర్ల విశ్వాసం కూడా బలహీనపడింది. అయితే ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని తిరిగి నింపేందుకు అదానీ గ్రూప్ అనేక అవసరమైన నష్టనివారణ చర్యలను చేపట్టింది. ఈ ఎపిసోడ్‌లో గ్రూప్ వివిధ మార్గాల్లో నిధులు సమీకరించాలని ప్లాన్ చేస్తోంది. అదానీ గ్రూప్‌కు చెందిన మూడు లిస్టెడ్ కంపెనీలు అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్ క్యాలెండర్ ఇయర్ చివరి నాటికి క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ ప్రారంభించడం ద్వారా రూ. 33,000 కోట్లను సమీకరించాలని చూస్తున్నాయి.
అదానీ గ్రూప్ ప్రస్తుతం నవీ ముంబై విమానాశ్రయం ప్రాజెక్ట్, గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులను ప్రారంభించడంలో బిజీగా ఉంది. వీటికి తోడు గతవారం మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై ప్రైమ్ లొకేషన్లో ఉన్న ధారావి మురికివాడ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను అదానీ గ్రూప్‌కు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సుమారు రూ.20,000 కోట్ల పెట్టుబడి అవసరమని తెలుస్తోంది. పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అదానీ గ్రూప్ తన ఫైనాన్స్ వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications