Adani: హిండెన్ బర్గ్ ఆరోపణల అనంతరం నిండా మునిగిన అదానీ గ్రూపు.. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని సంపాదించడానికి చెయ్యని ప్రయత్నం లేదు. ముందుగా రుణాల నుంచి విముక్తి దిశగా చర్యలు తీసుకుంది. అనంతరం వివిధ మార్గాల ద్వారా బిలియన్ల కొద్దీ నిధులను సేకరించడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా షేర్ ఆఫర్ ద్వారా సమీకరణకు వెళ్లాలన్న యెచనలో ప్రస్తుతం ఉన్నట్లు తెలుస్తోంది.
అదానీ గ్రూపు సంక్షోభంలో కూరుకున్న అనంతరం తిరిగి పుంజుకోవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. తమ పునరాగమన వ్యూహంలో భాగంగా.. సంస్థాగత పెట్టుబడిదారులకు ఈక్విటీ షేర్స్ విక్రయించడం ద్వారా సుమారు 3 బిలియన్ డాలర్లను సేకరించాలని చూస్తోంది. యూరప్, మిడిల్ ఈస్ట్ పెట్టుబడిదారులు బలమైన ఆసక్తిని కనబరుస్తున్నారని తెలుస్తోంది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ మరియు అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ బోర్డులు ఇప్పటికే నిధుల సమీకరణకు ఆమోదం తెలిపాయి. అర్హత కలిగిన సంస్థాగత పెట్టుబడిదారులకు వాటాల విక్రయం ద్వారా 2.5 బిలియన్ డాలర్లకు సేకరించాలని చూస్తున్నాయి. ఈ లిస్టులోకి తాజాగా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ బోర్డు సైతం చేరే అవకాశం ఉంది. రాబోయే రెండు వారాల్లో బిలియన్ డాలర్ల సమీకరణ కోసం ఈ సంస్థను రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బోర్డు అనుమతుల అనంతరం అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ మరియు అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ లు వాటాదారుల అనుమతిని కోరాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ బోర్డు కూడా జూన్ మొదటి లేదా రెండో వారంలో ఇందుకోసం సమావేశం కావచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గ్రూపు మూలధన వ్యయ అవసరాల కోసం సమకూర్చనున్న 3.5 బిలియన్ల సేకరణ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో పూర్తయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications