Data center: ఏఐ డేటా సెంటర్ల కోసం అదానీ భారీ పెట్టుబడి! అసలు ప్లాన్ ఇదేనా?
భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. 2035 నాటికి భారతదేశంలో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ (Data center) నెట్‌వర్క్ ను నిర్మించడానికి సుమారు 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8.4 లక్షల కోట్లు) భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తిగా పునరుత్పాదక ఇంధనం (Renewable Energy) ద్వారా పనిచేయడం విశేషం. దీనివల్ల భారత్ గ్లోబల్ ఏఐ మ్యాప్ లో అగ్రగామిగా నిలవడమే కాకుండా పర్యావరణ హితంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందని సంస్థ వెల్లడించింది.

$250 బిలియన్ల ఎకోసిస్టమ్
అదానీ గ్రూప్ చేసే ఈ ప్రాథమిక పెట్టుబడి వల్ల అనుబంధ రంగాలలో మరో 150 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అంటే వచ్చే దశాబ్ద కాలంలో సర్వర్ తయారీ, ఎలక్ట్రికల్ వ్యవస్థలు, క్లౌడ్ ప్లాట్‌ఫారమ్ లు కలిపి మొత్తం 250 బిలియన్ డాలర్ల విలువైన ఏఐ మౌలిక సదుపాయాలు భారత్‌లో సిద్ధం కానున్నాయి. దీనివల్ల వేల సంఖ్యలో ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
అదానీ వ్యూహం: ఇంధనం & కంప్యూటింగ్
"భవిష్యత్తులో ఇంధనం (Energy) , కంప్యూటింగ్ పవర్ రెండింటిపై పట్టు ఉన్న దేశాలే ప్రపంచాన్ని శాసిస్తాయి" అని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. భారత్ కేవలం ఏఐ వినియోగదారుగా మాత్రమే ఉండకూడదని, సొంతంగా డేటా సార్వభౌమాధికారాన్ని (Technological Sovereignty) కలిగి ఉండాలన్నదే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం అదానీ గ్రూప్ ఐదు అంచెల ఏఐ స్టాక్ (Five-layer AI stack) పై దృష్టి సారించింది.
వైజాగ్, హైదరాబాద్‌లలో ప్రాజెక్టులు
అదానీ గ్రూప్ తన డేటా సెంటర్ (Data center) విభాగమైన 'అదానీ కనెక్స్' (AdaniConnex) ద్వారా ఇప్పటికే 2 గిగావాట్ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. దీనిని 5 గిగావాట్లకు పెంచాలన్నది సంస్థ లక్ష్యం. ఈ ప్రయాణంలో గ్లోబల్ టెక్ దిగ్గజాలతో అదానీ చేతులు కలిపారు..
- విశాఖపట్నం: గూగుల్‌తో కలిసి వైజాగ్‌లో ఒక భారీ ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు.
- హైదరాబాద్, పూణే: మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని కార్యకలాపాలను విస్తరిస్తున్నారు.
- ఫ్లిప్‌కార్ట్: ఈ-కామర్స్ , ఏఐ అవసరాల కోసం ఫ్లిప్‌కార్ట్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఎందుకు ఈ పెట్టుబడి ముఖ్యం?
సాధారణంగా ఏఐ మోడల్స్ శిక్షణకు , నిర్వహణకు అపారమైన విద్యుత్ శక్తి, అత్యాధునిక సర్వర్లు అవసరం. అదానీకి ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ రంగంలో గట్టి పట్టు ఉంది. తమ సొంత గ్రీన్ ఎనర్జీని వాడుకుంటూ డేటా సెంటర్లను నడపడం ద్వారా ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా.. గ్లోబల్ కంపెనీలకు భారత్‌ను ఒక హబ్ గా మార్చవచ్చు. ఈ భారీ ప్రాజెక్టు విజయవంతమైతే భారత్ ప్రపంచ ఏఐ రేసులో అమెరికా, చైనాలకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications