6 రోజుల్లో రూ.2.2 లక్షల కోట్లు లాభపడ్డ అదానీ స్టాక్స్.. Adani Powerలో 6 కంపెనీల విలీనం..
Adani Stocks: ఈ మధ్య కాలంలో అదానీ గ్రూప్ షేర్ల దూకుడు కొనసాగుతోంది. దీనికి తోడు గౌతమ్ అదానీ వరుసగా శుభవార్తలు చెబుతూ ఇన్వెస్టర్లలో సంతోషాన్ని నింపుతున్నారు. గడచిన ఆరు ట్రేడింగ్ సెషన్లలో అదానీ గ్రూప్ కంపెనీల విలువ భారీగా పెరిగింది.

అదానీ స్టాక్స్..
ట్రేడింగ్ సమయంలో అన్ని అదానీ స్టాక్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. అదానీ గ్రూప్‌లోని మొత్తం 10 స్టాక్‌ల మార్కెట్ విలువ బుధవారం రూ.17,000 కోట్లకు పైగా పెరిగింది. ఈ క్రమంలో అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్ షేర్లు అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి.

పెరిగిన మార్కెట్ క్యాప్..
గత 6 ట్రేడింగ్ సెషన్లలో అదానీ కంపెనీల మార్కెట్ క్యాప్ దాదాపు రూ.2.2 లక్షల కోట్ల మేర పెరిగింది. దీంతో అదానీ గ్రూప్ షేర్ల మార్కెట్ క్యాప్ ఇప్పుడు రూ.9 లక్షల కోట్లు దాటింది. ఫిబ్రవరి 27, 2023 నాటికి అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.6.82 లక్షల కోట్లుగా ఉంది. రెండు రోజుల కిందట అమెరికన్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ GQG పార్ట్‌నర్స్ భారీ పెట్టుబడిని ప్రకటించటం, రుణాన్ని కంపెనీ ముందస్తుగా చెల్లించటం వల్ల ఇన్వెస్టర్లలో ఉత్సాహం నెలకొంది.

అదానీ పవర్ నిర్ణయం..
అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ పవర్, అదానీ పవర్ (ముంద్రా)తో సహా ఆరు అనుబంధ సంస్థలను తనలో విలీనం చేసుకుంది. అదానీ పవర్ లిమిటెడ్ (ఏపీఎల్)కు చెందిన ఆరు పూర్తిగా అనుబంధ కంపెనీలను విలీనం చేసినట్లు అదానీ పవర్ మంగళవారం బీఎస్‌ఈకి తెలిపిన వివరాల్లో వెల్లడించింది. అదానీ పవర్ మహారాష్ట్ర లిమిటెడ్ (APML), అదానీ పవర్ రాజస్థాన్ లిమిటెడ్ (APRL), ఉడిపి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (UPCL), రాయ్‌పూర్ ఎనర్జెన్ లిమిటెడ్ (REL), రాయ్‌ఘర్ ఎనర్జీ జనరేషన్ లిమిటెడ్ (REGL), అదానీ పవర్ (ముంద్రా) లిమిటెడ్ ఉన్నాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అహ్మదాబాద్ బెంచ్ ఈ కంపెనీలను APLతో విలీనానికి ఆమోదించింది.

పవర్ స్టాక్ దూకుడు..
గడచిన ఆరు రోజులుగా అదానీ పవర్ స్టాక్ అప్పర్ సర్క్యూట్‌లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో స్టాక్ దాదాపు 25 శాతం వరకు పెరిగింది. ఈరోజు ఎన్ఎస్ఈ సూచీలో స్టాక్ ధర రూ.186.60 వద్ద ఉంది.


Click it and Unblock the Notifications