Adani: అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ నివేదిక వల్ల అదానీ గ్రూపు తీవ్ర ఒడిదుడుకులకు గురైన సంగతి తెలిసిందే. అనంతరం భారీ నష్టాల్లోకి వెళ్లిన గ్రూపు సంస్థలు.. స్టాక్ మార్కెట్ ను సైతం షేక్ చేశాయి. నష్ట నివారణకు దిగిన గౌతమ్ అదానీ.. తనదైన స్టైల్ లో పరిస్థితిని చక్కదిద్దారు. తాజాగా కంపెనీ నుంచి వచ్చిన అప్డేట్ చూస్తే, గ్రూప్ సంస్థలన్నీ తిరిగి గాడిలో పడినట్లు అర్థం చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, పోర్టులు, పవర్ ప్రాజెక్టులు సహా ఇతర రంగాల్లో అదానీ గ్రూపు కంపెనీల హవా కొనసాగుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో హిండెన్ బర్గ్ నివేదిక కొంత నిరాశపరిచినప్పటికీ.. తన సంస్థలకు పూర్వ వైభవం తీసుకురావడంలో గౌతమ్ అదాని విజయం సాధించారు. దీంతో గ్రూపు మొత్తం లాభాల్లో 42 శాతం వృద్ధి(పన్ను చెల్లింపులకు ముందు) నమోదైనట్లు కంపెనీ ప్రకటించింది. వ్యాపారాలు అద్భుతంగా జరగడంతో.. ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగినట్లు తెలిపింది.

ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య చూస్తే.. గ్రూప్ చరిత్రలో అత్యధిక ఆదాయం పొందినట్లు కంపెనీ వెల్లడించింది. Q1లో 23 వేల 532 కోట్లు EBITDA నమోదు చేసినట్లు తెలిపింది. 2019 పూర్తి ఆర్థిక సంవత్సరంలో సాధించిన EBITDAను కేవలం ఒక త్రైమాసికంలోనే ఆర్జించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. దీనిలో 86 శాతం అంటే 20 వేల 233 కోట్లు కేవలం కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు యుటిలిటీ ప్లాట్ఫామ్స్ నుంచి రాబట్టడం విశేషం.
ఇంత జరిగినా, 10 లిస్టెడ్ కంపెనీలతో కొనసాగుతున్న అదానీ గ్రూపు ఇప్పటికీ అప్పులతో సతమతమవుతోంది. అదానీ ఎంటర్ప్రైజెస్, గ్రీన్ ఎనర్జీ, పవర్ లిమిటెడ్, ఎనర్జీ సొల్యూషన్స్, టోటల్ గ్యాస్ మొదలైన అన్నింటి క్యాష్ బ్యాలెన్స్ 42 వేల 115 కోట్లతో పోలిస్తే.. ఇంకా 18 వేల 690 కోట్లు రుణభారం ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications