రైతుల పొట్టకొట్టేందుకు అదానీ గ్రూపు కుట్ర.. ది రిపోర్టర్స్ కలెక్టివ్ కథనంలో ఏముందంటే..
రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి కేంద్రంలోని మోదీ సర్కారు పలు పథకాలు ప్రవేశపెట్టింది. అయితే మరో అడుగు ముందుకేసి 3 సాగు చట్టాలను తీసుకురావడానికి ప్రయత్నించింది. కానీ ఏడాదికి పైగా అన్నదాతలు చేపట్టిన నిరసనాగ్రహాలతో వాటిని ఉపసంహరించుకోక తప్పని పరిస్థితి తలెత్తింది. ఈ చట్టాలు ప్రవేశపెట్టే క్రమంలో జరిగిన కుట్రపై 'ది రిపోర్టర్స్ కలెక్టివ్' ఓ రీసెర్చ్ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది.
అధికార BJPకి సన్నిహితుడు, NRI సాఫ్ట్ వేర్ వ్యాపారవేత్త శరద్ మరాఠేని నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్ లో చేర్చడాన్ని నివేదిక తప్పుపట్టింది. రైతుల ఆదాయం పెంచేందుకు తీసుకొస్తున్న చట్టాల గురించిన కమిటీలో రైతు ప్రాతినిధ్యం లేకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అందుకు బదులు వ్యవసాయానికి ఏమాత్రం సంబంధం లేని మరాఠేని టాస్క్ ఫోర్స్ లో తీసుకోవడం పలు అనుమానాలు రేకెత్తించినట్లు తెలిపింది.

రైతుల పొట్టకొట్టే ఈ కుట్రలో అదానీగ్రూపు హస్తంపైనా అనుమానం వ్యక్తం చేసింది. ధాన్యం నిల్వపై పరిమితి ఎత్తివేయాలని నీతిఆయోగ్ టాస్క్ ఫోర్స్ కు 2018లో అదానీ గ్రూపు విజ్ఞప్తి చేసింది. తద్వారా రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు ఆయా ఉత్పత్తులను కొనుగోలు చేసి, బహిరంగ మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించే విధంగా ప్లాన్ చేసి ఉండవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
దేశంలోని వివిధ పోర్టులు, ఎయిర్ పోర్టులు అదానీ గ్రూపు చేతుల్లో ఉండటంతో.. ఆయా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసి అధిక ధరకు విక్రయించే ప్లాన్ తో ఇలా చేసి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పరోక్షంగా అన్నదాతలపై ఆధిపత్యం చెలాయించడమే కాకుండా వారి కష్టాన్ని దోచుకోవడానికి ఈ విధంగా కుట్ర జరిగిందని ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి.


Click it and Unblock the Notifications